డబ్బులిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తాం..

-

అసలే ఇది ఎన్నికల సీజన్. ఇక.. ఈ సమయంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తామంటూ కొంతమంది ముందుకు రావడం అనేది నిజంగా చర్చనీయంశమే కదా. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో చోటు చేసుకున్నది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లను ట్యాంపర్ చేస్తాం… ఒక ఈవీఎం ట్యాంపరింగ్ కు 2.5 లక్షలు ఇవ్వండి.. అంటూ భోపాల్ కు చెందిన ఓ అభ్యర్థికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు పోయిన నెలే అయిపోయాయి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ అభ్యర్థికి ఫోన్ కాల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. భింధ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ క్యాండిడేట్ రమేశ్ కు ఢిల్లీ నుంచి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫోన్ చేశాడు. తాము ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడంలో నిపుణులమని.. మీకు అనుకూలంగా ఫలితాలను మార్చుతామని.. అందుకు గాను తమకు ఒక ఈవీఎం ట్యాంపరింగ్ కు 2.5 లక్షలు ముట్టజెప్పాలని తెలిపాడు.

దీంతో ఆ అభ్యర్థి.. అతడిని గ్వాలియర్ రమ్మన్నాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గ్వాలియర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. దీంతో రమేశ్ కూడా అక్కడికి వెళ్లాడు. అయితే.. అంతకు ముందే పథకం ప్రకారం పోలీసులు అక్కడ మఫ్టీలో ఉన్నారు. ఇంతలో రమేశ్ కు ఆ వ్యక్తి ఎలా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తాం అనే విషయాన్ని తన ఫోన్ ద్వారా చూపించాడు. ఇంతలోనే అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇవి కేవలం అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజడానికి వేసే ఎత్తులు తప్పితే మరేమీ కాదని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version