ప్రస్తుతం చిన్నారులు అన్ని రంగాల్లోనూ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులోనే వారు పెద్దల్లా అనేక అంశాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఒకప్పుడంటే పిల్లలకు టెక్నాలజీ అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచం అందుబాటులో ఉంది. దాంతో వారు అద్భుతాలు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన ఓ 7 ఏళ్ల బాలుడు కూడా అలాగే అద్భుతం చేసి అందరితోనూ ఔరా.. అనిపించాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఒడిశాలోని బాలాంగిర్ అనే ప్రాంతానికి చెందిన వెంకట్ రామన్ పట్నాయక్ 3వ తరగతి చదువుతున్నాడు. అతను 2019 మార్చిలో ఓ యాప్ ద్వారా కోడింగ్ పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే అతను జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్‌లో మొత్తం 160 క్లాసులకు హాజరై ఆయా కోర్సుల్లో పట్టు సాధించాడు. ఈ క్రమంలో అతను.. ఆ కోర్సులు చేసిన వారికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ నిర్వహించే ఎంటీఏ (మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్) ఎగ్జామ్‌కు హాజరై ఉత్తీర్ణత సాధించాడు. ఆ సర్టిఫికేషన్‌ను అతను పొందాడు.
అయితే నిజానికి ఆ సర్టిఫికేషన్‌ను పొందాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. పెద్దలకే సాధ్యమయ్యే పని అది. కానీ అతను 7 ఏళ్ల వయస్సులోనే ఆ సర్టిఫికేషన్‌ను పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక అతను టెక్నాలజీ పరంగా కెరీర్లో ముందుకు సాగాలని చెప్పి ఆ సర్టిఫికేషన్‌ను చేశానని తెలిపాడు.