చంద్రయాన్ 2 సక్సెస్ అయినందున ఇక త్వరలోనే భారత ప్రభుత్వం సముద్రయాన్ ప్రాజెక్టును కూడా చేపట్టనుంది. అందుకు గాను ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 2 ను విజయవంతంగా ప్రయోగించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే చంద్రయాన్ 2 నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ మరొక నాలుగైదు రోజుల్లో చంద్రుడిపై దిగనుంది. ఆ తరువాత దాన్నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి చంద్రుడిపై తిరుగుతూ అక్కడి మట్టి, ఇతర ఖనిజాల శాంపిల్స్‌ను సేకరించి వాటిని విశ్లేషించి ఆ సమాచారాన్ని చంద్రయాన్ 2 ద్వారా మనకు చేరవేయనుంది. అయితే చంద్రయాన్ 2 సక్సెస్ అయినందున ఇక త్వరలోనే భారత ప్రభుత్వం సముద్రయాన్ ప్రాజెక్టును కూడా చేపట్టనుంది. అందుకు గాను ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి.
భారత ప్రభుత్వం 2021-22లో సముద్రయాన్ ప్రాజెక్టును నిర్వహించనుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ (ఎన్ఐఓటీ) ఓషియన్ టెక్నాలజీ ఆధ్వర్యలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మహా సముద్రాల గర్భంలోకి సబ్‌మెరైన్ తరహా వాహనాన్ని పంపుతారు. సుమారుగా 6వేల మీటర్ల లోతు వరకు ఆ ప్రత్యేకమైన వాహనాలు వెళ్లేలా వాటిని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఉన్న సబ్ మెరైన్లు కేవలం 200 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్లగలవు. దీంతో 6వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగేలా ఓ ప్రత్యేకమైన సబ్మెర్సిబుల్ వాహనాన్ని తయారు చేసి అందులో ముగ్గురు వ్యక్తులను సముద్ర గర్భంలోకి పంపనున్నారు.
ఇక సముద్ర గర్భంలోకి వెళ్లే సైంటిస్టులు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. అలాగే అక్కడ ఉండే జీవ రాశులు, మొక్కలు, ఖనిజాలు.. వాటి వల్ల మనకు ఏమైనా ఉపయోగాలు ఉంటాయా.. అన్న వివరాలను వారు అధ్యయనం చేస్తారు. కాగా మహా సముద్రాల్లో ఇలాంటి పరిశోధనలు చేసేందుకు గాను ఇప్పటికే భారత్‌కు అనుమతి ఉంది. మధ్య హిందూ మహాసముద్రంలో సుమారుగా 75వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్ర గర్భ పరిశోధనలు చేసుకునేందుకు గాను ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇప్పటికే భారత్‌కు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు పూనుకున్నామని ఎన్ఐఓటీ డైరెక్టర్ ఎంఏ ఆత్మానంద్ ఓ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా సముద్రయాన్ వల్ల భారత్ కూడా మహాసముద్రాల అంతర్భాగాలను శోధించే దేశాల జాబితాలో చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..!