ఈ రోజుల్లో జనం చెవిలో ఇయర్ ఫోన్స్ లేకుండా బయటకు రావడం లేదు.. జనం అవసరాలు కూడా అలాగే ఉన్నాయి లెండి.. ఫోన్ కాల్స్ ఎక్కువ రావడం, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాల చర్చలు, ఉద్యోగ అవసరాలు, ప్రేమ ఇలాంటివి ఎన్నో చెవిలో ఇయర్ ఫోన్స్ కి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇళ్ళల్లో ఆడాళ్ళు కూడా వంట చేస్తున్నప్పుడో ఏదైనా పనులు చేస్తున్నప్పుడో, వినోద భరిత సీరియల్స్ చూసే సమయంలోనో ఎక్కువగా వాటిని వినియోగిస్తూ ఉంటారు. మరి వాటి వలన వచ్చే నష్టాల గురించి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారా..? అంటే లేదనే చెప్పాలి..
తాజాగా విడుదలైన సర్వేలో ఒక సంచలన విషయ౦ బయటపడింది. వినికిడి సమస్యల్లో ఎక్కువగా ఆస్పత్రికి వెళ్ళిన వారిలో ఇయర్ ఫోన్స్ వాడే వారే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది. 2000 మంది వినికిడి సమస్యలు ఉన్నవారి గురించి… సర్వే చేయగా తాము రోజులో 4 గంటలకు పైగా ఇయర్స్ ఫోన్స్ వాడతామని, కొన్ని రోజుల నుంచి చెవు సరిగా వినపడటం లేదని చెప్పారట. ఇక 3 గంటలకు పైగా వాడే వారు చెవిలో దురద వంటి సమస్యలను చెప్పారు. వీరిలో ఎక్కువ మందికి భవిష్యత్తులో వినికిడి మెషిన్ లు ఇవ్వాలని వైద్యులు చెప్పడం గమనార్హం.
ఇక ఇతరుల నుంచి ఇయర్ ఫోన్ తీసుకుని వాడే వారిలో ఎక్కువగా చెవు పోటు సమస్యలు ఉన్నాయని సర్వే గుర్తించింది. ఇక ఇయర్ బడ్స్ మార్చకుండా వాడితే ఎలర్జీ వంటి సమస్యలు ఉన్నాయని, చెవిలో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుందని సర్వేలో వెల్లడైంది. ఇక ఇటీవల ప్రమాదాల్లో వంద లో 7 నుంచి 9 ప్రమాదాలకు కారణాలు ఇయర్ ఫోన్స్ అని తెలిసింది. అందుకే వాటి వాడకం తగ్గిస్తే మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన ఒక యునివర్సిటి ఈ సర్వే నిర్వహించింది… కాస్త జాగ్రత్తగా ఉంటె మంచిది ఏమో… ఆలోచించండి…!