చనిపోయో ముందు లైఫ్‌ అంతా ఒక్కసారి కళ్లముందు ఫ్లాష్‌ అవుతుందట..!

-

ఎప్పుడు పుడతామో చెప్పగలం కానీ.. ఎప్పుడు పోతామో ఎవ్వరూ చెప్పలేరు. గంట క్రితం నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి సడన్‌గా హాట్‌ ఎటాక్‌తో చనిపోవచ్చు.. లేదా జరగరానిది ఇంకేదైనా జరగొచ్చు.. చావుపుట్టుకలు మన చేతుల్లో లేని పని. వీటి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.! అయితే సినిమాల్లో ఎవరైనా చనిపోయే ముందు వారికి వాళ్ల లైఫ్‌ అంతా స్పీడ్‌మోషన్‌లో ఒక్కసారిగా ఫ్లాష్‌ అవుతున్నట్లు చూపిస్తారు. నిజంగా ఇది జరుగుతుందా అని మీకు డౌట్‌ రావొచ్చు.. నిజంగానే అలా జరుగుతుంది ఆధారాలతో సహా రుజువైంది.

యూఎస్‌లోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలోని న్యూరో సర్జన్ బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఎవరైనా వ్యక్తులు మరణానికి దగ్గరగా చివరి క్షణాలలోకి వచ్చినపుడు, ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, వారి మెదడు వారి జీవితంలో అనుభవించిన కొన్ని అద్భుతమైన క్షణాలను మళ్లీ ప్లే చేస్తుందట.

మనిషి చనిపోయినప్పుడు గుండె ఆగిపోతుంది, కానీ అదే సమయంలో మెదడులో కొంత కార్యాచరణ జరుగుతూనే ఉంటుంది. అది ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? మరణిస్తున్న వ్యక్తి మెదడు స్కాన్‌ చేస్తున్నప్పుడు, మరణం తర్వాత మెదడులో ఏమి జరుగుతుందో ట్రాక్ చేసిన న్యూరో సైంటిస్టులను ఒక అంశం ఆశ్చర్యానికి గురి చేసింది. 87 ఏళ్ల మూర్ఛ రోగి మెదడును స్కాన్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా అతడు గుండెపోటుతో మరణించాడు. ఆ రోగి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 30 సెకన్లలో ఆతడి మెదడు కొన్ని జ్ఞాపకాలను రీప్లే చేసినట్లు స్కాన్‌లో కనిపించింది. ఈ పరిశోధన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమయ్యాయి.

వ్యక్తి మూర్ఛలను గుర్తించడానికి, చికిత్స చేయడానికి శాస్త్రవేత్తలు రోగికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (EEG) స్కాన్‌లను చేశారు. అయితే అదే సమయంలో అతడు మరణించాడు. EEG మెషిన్ రన్ అవుతూనే ఉంది. ఇది శాస్త్రవేత్తలకు మరణిస్తున్న మానవుని మెదడు కార్యకలాపాలపై మొదటిసారిగా రికార్డ్ డాక్యుమెంట్ అందించింది. ఎందుకంటే ఈ సంఘటన చాలా అరుదు. ఇలా స్కాన్‌ చేస్తున్నప్పుడ మనిషి చనిపోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. ఎలాంటి ముందస్తు ప్లాన్ చేయలేదు, వేరే ఇతర చికిత్స కోసం స్కాన్ నిర్వహిస్తుండగా రోగి చనిపోయాడు. ఆ సమయంలో స్కానింగ్ లో సాధారణంగా వ్యక్తులు కలలు కనే సమయంలో, అలాగే ధ్యానం చేసే సమయంలో మెదడులో సంభవించే రిథమిక్ వేవ్ నమూనాలను వైద్యులు కనుగొన్నారు.

పరిశోధనలో ఏం రుజువైంది?
మెదడులో జరిగే కార్యాచరణను మెదడు డోలనాలు లేదా మెదడు తరంగాలు అని పిలుస్తారు. సజీవంగా ఉండే మానవ మెదడుల్లో సాధారణంగా ఇలాంటి మూడు లయబద్ధమైన తరంగాలు ఉంటాయి. EEG మెదడు స్కాన్ ఒక ఆసిలేటరీ మెదడు తరంగ నమూనాను కనుగొంది, దీనిలో మెదడుకు సంబంధించిన ఆల్ఫా, బీటా, తీటా బ్యాండ్‌లలో కార్యకలాపాలు సాపేక్షంగా తగ్గాయి, గామా బ్యాండ్‌లో కార్యాచరణ సాపేక్షంగా పెరిగింది. ఈ ఆసిలేటరీ నమూనాలు, గామా తరంగాల పెరుగుదల మెమరీ రీకాల్‌ను సూచిస్తాయి. అంటే చనిపోయే ముందు ఫ్లాషింగ్ నిజమని సైన్స్ పరంగా నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version