టమోటా ధరలు ఘోరంగా పెరిగాయి. కేజీ వందకు పైనే ఉండటంతో చాలా మంది అసలు వీటి జోలికి వెళ్లడమే మానేశారు. ఇంతకుముందు మార్కెట్‌కు వెళ్లి రెండు మూడు కేజీలు కొనేవాళ్లు కూడా ఇప్పుడు పూర్తిగా వీటిని తీసుకోవడం లేదు. ఒకవేళ కొన్నా అరకేజీ, పావు కేజీలతోనే సరిపెట్టుకుంటున్నారు. సామాన్యులు 120 పెట్టి కేజీ టమోటాలను కొనలేరు. ఆ డబ్బుతో వేరే కూరగాయలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా చూస్తే వివిధ ప్రాంతాల్లో టమాటా ధరలు కిలో రూ.250కి చేరుకున్నప్పటికీ, కనీసం 68 శాతం కుటుంబాలు తమ వినియోగాన్ని తగ్గించుకోగా, 14 శాతం మంది టమాటాను కొనుగోలు చేయడం మానేశారని లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది .
కొన్ని వారాలుగా, టొమాటోల రిటైల్ ధర బాగా పెరిగింది . అన్ సీజన్ భారీ వర్షాల కారణంగా ప్రధాన నగరాల్లో శుక్రవారం కిలోకు రూ. 244 వరకు ఉంది. పెరుగుతున్న టమోటా ధరల మధ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఢిల్లీ , లక్నో, పాట్నా కాన్పూర్‌లోని వివిధ ప్రదేశాలలో వంటగది సరుకులను తగ్గింపు ధరకు విక్రయిస్తోంది.
నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) కేంద్రం తరపున టమోటాలను విక్రయిస్తున్నాయి. దాదాపు 87 శాతం మంది టమాటా కోసం కిలోకు రూ. 100కు పైగా వెచ్చిస్తున్నట్లు ధృవీకరించారు, అయితే 13 శాతం మంది మాత్రమే కిలోకు రూ. 100 కంటే తక్కువ చెల్లిస్తున్నారు, బహుశా గ్రామీణ ప్రాంతాల్లో లేదా టమోటాలు పండించే ప్రదేశాలలో ఇలా టమాటాను తక్కువకు కొనుగోలు చేస్తున్నారని సర్వే నివేదికలో తేలింది.
టమాటల సగటు అఖిల భారత రిటైల్ ధర కిలోకు రూ. 116.76 ఉండగా, గరిష్ట రేటు కిలో రూ. 244, కనిష్టంగా కిలో రూ. 40. మెట్రో నగరాల్లో టొమాటోలు ఢిల్లీలో కిలో రూ.178గా ఉండగా, ముంబైలో రూ.147, కోల్‌కతాలో కిలో రూ.145, చెన్నైలో గురువారం రూ.132గా ఉంది. టొమాటో ధరలు సాధారణంగా జూలై-ఆగస్టు మరియు అక్టోబరు-నవంబర్ మాసాల్లో పెరుగుతాయి, ఇవి సాధారణంగా తక్కువగా ఉత్పత్తి అయ్యే నెలలు. రుతుపవనాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి.