చిన్నప్పుడు అంతా చదువు అంటారు.. చదువు అయిపోయిన తర్వాత జాబ్ అంటారు. జాబ్ వచ్చాక పెళ్లి అంటారు. ఎప్పుడు ఏదో ఒకటి అనడమే ఈ పెద్దోళ్లా పనా అని మనం అనుకుంటాం.. ఈరోజుల్లో పెళ్లి అనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారిపోయింది. లవ్ చేసే ఏజ్‌లో లవ్‌ను పక్కనపెట్టి కెరీర్ మీద దృష్టిపెట్టారు.. ఇప్పుడు లవ్ చేద్దాం అంటే.. టైమ్ లేదు.. పెళ్లి చేసుకునే ఉత్సాహం మూడ్ రెండూ లేవు.. అటు అమ్మాయిలకు, ఇటు అబ్బాయిలకూ పెళ్లి అనేది ఒక బ్రహ్మపదార్థం అయిపోయింది. చేసుకోవాలని లేదు.. ఇంకో సంవత్సరం ఆగుదాంలే ఇంకాస్త శాలరీ పెరిగాక చేసుకుందాంలే అనే ఆలోచన నేటి యువతలో చాలా మందికి ఉంది. లవ్ మ్యారేజెస్ అయితే అవుతున్నాయి కానీ.. అరేంజ్ మ్యారేజ్ అంటే కష్టమే..! పాతికేళ్లు వచ్చినా అమ్మాయిలకు పెళ్లి చేసుకునే ఆలోచన రావడం లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి.
మనుషుల్లో వచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన అవగాహన, ఆడపిల్లల్లో చదువుకోవాలనే తపన.. లాంటి అంశాలు బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేశాయి.18 ఏళ్లు, ఆపైన ఉంటేగానీ అమ్మాయి పెళ్లి గురించే ఆలోచించడం లేదు నేటితరం తల్లిదండ్రులు. వాళ్లు ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగాలు చేయాలనే ఆసక్తిని ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే పెళ్లిని వాయిదా వేస్తామన్నా, అభ్యంతరం చెప్పడం లేదు.
26 ఏళ్లకు కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు
ఈ పరిణామాల క్రమంలోనే.. దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2017 వివరాల ప్రకారం 22.1 ఏళ్ల సగటు కాస్త బెటరైంది. దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా ఉందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. అత్యధికంగా 26 ఏళ్లకు కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు జరుగుతుంటే, అత్యల్పంగా 21 ఏళ్లలోపే జార్ఖండ్, బెంగాల్ అమ్మాయిలు మ్యారేజీ చేసుకుంటున్నారట..
23.5 ఏళ్లకు తెలంగాణ అమ్మాయిల పెళ్లిళ్లు
దేశ సగటు కంటే తెలంగాణ మెరుగైన పొజిషన్లో ఉంది.. సర్వే గణాంకాలను పరిశీలిస్తే 2017 నాటికి దేశంలో మహిళల వివాహ సగటు వయసు 22.1 ఏళ్లు. 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరింది. తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లు. సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని సర్వేలో తేలింది.
ఇక దక్షిణ తెలంగాణతోపాటు తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని సర్వేలో వెల్లడైంది. అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లోని యువతులే కొంత లేటుగా మ్యారేజీ చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది.