ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో మన పూర్వీకులు అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. కొండలపై కోటలే నిర్మించిన ఘనత వారిది. కానీ ఈరోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ..ఓ గ్రామస్థులు కేవలం ఉలి, సుత్తి సాయంతో 1.2 కిలోమీటర్లు మేర కొండలో సొరంగం మార్గం నిర్మించారు. ఈ నిర్మాణంతో రోడ్డు పర్యటక ప్రాంతంగా మారిపోయింది. ఇంతకీ ఆ రోడ్డు ఏంటి, ఆ కొండేంటి చూసేద్దాం.
13 మందితో మొదలై..
తమ గ్రామం నుంచి సమీప నగరానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆ ఊరి ప్రజలు ప్రభుత్వానికి ఎంత విజ్ఞప్తి చేసినా..పాపం ఫలితం లేకుండా పోయింది. దీంతో 1972లో ఊరిలోని 13 మంది యువకులు తామే కొండలో సొరంగ మార్గం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించేంత ఆర్థిక స్థోమత వారి దగ్గర లేదు..ఉలి, సుత్తితో కొండ అంచులో సొరంగం తొవ్వడం మొదలుపెట్టారు. ఎంత శ్రమించినా ఒక మీటరు సొరంగానికే మూడు నెలల సమయం పట్టేది. అయినా, వారు వెనకడుగు వేయలేదు. మరింత కసిగా పనిచేయడం ప్రారంభించారు. వారి దృఢ సంకల్పాన్ని చూసి గ్రామంలోని మరికొందరు మందుకు వచ్చారు. దీంతో బలం, పనితనం పెరిగింది. అలా ఐదేళ్లు శ్రమించి కొండపై నుంచి కిందకి 1.2కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించారు.
ప్రపంచానికి అప్పుడు తెలిసింది..
కొండపై రోడ్డు కనిపించడంతో అక్కడో గ్రామం ఉందన్న విషయం అప్పుడే ప్రపంచానికి తెలిసింది. కొండ అంచుల్లో సొరంగ మార్గంలో సాహస ప్రయాణం చేయడానికి ఇష్టపడేవారు ఈ గ్రామానికి క్యూ కట్టేసారు.. అలా.. ఈ గ్రామం సందర్శక ప్రాంతంగా మారింది. గ్రామస్థులకు పంటలపై వచ్చే ఆదాయమే కాకుండా.. పర్యటకంగానూ ఆదాయం లభిస్తోంది. ఇలా 13 మందితో మొదలైనా వారి కష్టం ఊరందరి సాయంతో సమస్య తీరింది.
– Triveni Buskarowthu