బ్రేకప్ బాధిస్తోందా? ఈ టిప్స్ పాటించి బ్రేకప్ బాధ నుంచి బయటపడండిలా..!

-

బ్రేకప్ వేదనను వదిలేసి.. మనసును నియంత్రణలోకి తెచ్చుకొని ముందుకెళ్లాలి. బ్రేకప్ విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చోకుండా.. ఈ టిప్స్ పాటించండి.. మీరు బ్రేకప్ బాధ నుంచి ఇట్టే బయటపడిపోతారు.

బ్రేకప్. ఒక రిలేషన్ షిప్ కు పుల్ స్టాప్ పడే సమయం. అప్పటి వరకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉండే వాళ్లు.. బ్రేకప్ అయితే చాలు.. ఢీలా పడిపోతారు. తమ జీవితమే అయిపోయిందని టెన్షన్ పడుతుంటారు. ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ చీకటి.. ఏం చేయాలో అర్థం కాదు. అసలేంటి నా జీవితం ఇలా అయిపోయింది.. అని వాళ్లలో వాళ్లే బాధపడుతుంటారు. ఈ ప్రపంచంలో తామొక్కరమే ఒంటరి వాళ్లమని ఫీల్ అవుతుంటారు. అంధకారంలో బతికేస్తుంటారు. కానీ.. బ్రేకప్ అయినంతమాత్రాన.. జీవితాన్ని కూడా అంధకారం చేసుకోవాలా? ఏం… బ్రేకప్ అయితే జీవితం లేదా? బ్రేకప్ అనేది జీవితంలో ఒక భాగమే.. కానీ.. ముందు మీ జీవితం ఉంది అది గుర్తుంచుకోవాలి. అందుకే.. బ్రేకప్ వేదనను వదిలేసి.. మనసును నియంత్రణలోకి తెచ్చుకొని ముందుకెళ్లాలి. బ్రేకప్ విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చోకుండా.. ఈ టిప్స్ పాటించండి.. మీరు బ్రేకప్ బాధ నుంచి ఇట్టే బయటపడిపోతారు.

కొంచెం సమయం తీసుకోండి..

అవును.. బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే కష్టమే. అంత త్వరగా అది వదలదు. పిచ్చి లేస్తుంది. కానీ.. తప్పదు. కొంచెం సమయం తీసుకొని అయినా.. ఆ బాధను మరిచిపోవడానికి ప్రయత్నించండి. బ్రేకప్ బాధ నుంచి సాధారణ స్థితికి రావడం కోసం మీరే ప్రయత్నించాలి. కాస్త సమయం పట్టినా… అల్టిమేట్ గా మీరే మీ మనసును నియంత్రించుకోవాలి. మీకు నచ్చిన చోటుకు వెళ్లండి. కాసేపు ప్రశాంతంగా గడపండి. అప్పుడు మీ మనసు కాస్త కుదుట పడే అవకాశం ఉంది.

హార్ట్ బ్రేకింగ్ సాంగ్స్

హార్ట్ బ్రేకింగ్ సాంగ్స్ అంటే.. బ్రేకప్ మీద వచ్చే సాంగ్స్ అన్నమాట. ఆ పాటలు ఎందుకు వినాలంటే.. ఆ పాటల్లో సత్యాలు ఉంటాయి. ఆ సత్యాలు మీరు తెలుసుకోవాలి. బ్రేకప్ తర్వాత జీవితమే లేదన్నట్టుగా ప్రవర్తించకుండా… ఈ సాంగ్స్ వింటే మీకు జీవితం అర్థం తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే… వాటిని వినండి. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మీ జీవితంలోకి మీరు వచ్చేస్తారు.

సన్నిహితులతో బాధను పంచుకోవాలి..

మీకు అత్యంత సన్నిహితులు అనుకున్నవాళ్లతో మీ బాధను పంచుకోండి. మీ మనసులోని బాధను ఎదుటివ్యక్తితో పంచుకుంటే సగం భారం తగ్గుతుందంటారు. అందుకే.. మీ బాధను వాళ్లతో పంచుకోండి. మీ మనసులోని బాధ పోయి సంతోషం వస్తుంది. వాళ్లు కూడా మీ బాధను తరిమికొట్టడానికి ఏవైనా సలహాలు ఇస్తారు. వాటిని పాటించవచ్చు.

చెడు వ్యసనాలకు మాత్రం అలవాటు పడకండి..

చాలామంది బ్రేకప్ అయితే చాలు.. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతారు. దాని వల్ల మనసు కుదుట పడుతుందని అనుకుంటారేమో కానీ.. దాని వల్ల లేనిపోని అనర్థాలు తప్పితే వచ్చేదేమీ ఉండదు. మీకు బ్రేకప్ అయినంతమాత్రాన మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారా? వద్దు.. మీకు అంతకంటే బెటర్ జీవితం దొరుకుతుంది. కాబట్టి.. అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మనసు పాడైందని… ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవద్దు. అందుకే చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.

మీ గురించి కేర్ తీసుకోండి..

అంటే.. చాలామంది బ్రేకప్ అయ్యాక.. తమ గురించి కేర్ తీసుకోవడం మానేస్తారు. అలా ఉండకూడదు. మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి. అది ముఖ్యం. ఎలా అంటే… సమయానికి తినడం, వ్యాయామాలు చేయడం, మెడిటేషన్, యోగా.. లాంటివి చేస్తే.. మనసు కాస్త కుదుటపడుతుంది. మీరు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఏదో ఒక పనిలో నిమగ్నమవండి…

ఏదో ఒక పని.. మీకు నచ్చిన ఏ పనైనా కావచ్చు. దాంట్లో నిమగ్నమైపోండి. దాని వల్ల మీకు బ్రేకప్ కు సంబంధించిన విషయాలు అంతగా గుర్తుకు రావు. అది ఏ పనయినా సరే. దాంట్లోనే నిమగ్నమై పోండి. దాని వల్ల మీరు మరో జీవితాన్ని చూస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version