సాధారణంగా పిల్లలకు ఏ పేర్లు పెట్టాలన్న విషయంపై చాలా ఆలోచిస్తారు తల్లిదండ్రులు. కొందరు తమ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటే, మరికొందరు జాతక దృష్ట్యా జన్మ నక్షత్రాలను ఆధారంగా చేసుకుని పేర్లు పెడుతుంటారు. ఇక కొన్ని చోట్ల దేవుళ్లు, దేవతల పేర్లు పెట్టుకుంటుంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఇక మరి కొందరు తమ ఊరి పేరు తమ సంతానికి పెడుతుంటారు.
ఇక ఊరిపేరే తమ తొలి సంతానానికి పెట్టుకోవడం ఆ గ్రామంలో కొనసాగుతోంది. ఇది ఒక యేడాది కాదు రెండేళ్లు కాదు ఏకంగా కొన్ని దశాబ్దాల నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఆ గ్రామంలోని ఏ కుటుంబంలోనైనా సరే తమ తొలి సంతానానికి ఈ పేరే పెడుతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని (రాజానగరం నియోజకవర్గం) జోగింపేట గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి.
ఆ గ్రామస్తుల ఇలవేల్పు సుబ్బమ్మ పేరంటాలు. ఈ గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా గ్రామానికి చేరుకుని అమ్మవారిని పూజించడం పరిపాటి. శతాబ్దాల కాలంగా జోగింపేటలో ఏ కుటుంబంలోనైనా తొలి సంతానానికి మాత్రం ఆ ఊరి పేరే పెడతారు. ఈ ఆచారం అక్కడ కొన్ని సంవత్సరలుగా కొనసాగుతోంది. జోగింపేటలో అమ్మాయి పుడితే సుబ్బమ్మ, అబ్బాయి పుడితే గోపాలరావు, సుబ్బినాయుడు పేరే పెడతారు. వందల ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఏ కుటుంబంలోనైనా తొలి సంతానానికి ఇలా గ్రామ దేవత పేరు కలిసొచ్చేలా పేర్లు పెడుతున్నారు.