ఫుట్‌పాత్ మీద నడిస్తే చంపేస్తోంద‌ట‌!

-

అదో కిల్లర్ ఫుట్‌పాత్. ఆ ఫుట్‌పాత్ మార్గంలో ఎవరైనా నడిచి వెళ్తే మళ్లీ తిరిగి రారు. వారు పూర్తిగా కనిపించకుండా పోతారు. లేదా.. నీటిలో శవాలై తేలుతారు. మరి.. ఇంత భయానకమైన ఫుట్‌పాత్ ఎక్కడుందో.. ఎందుకంత ప్రమాదకరంగా మారిందో తెలుసుకుందాం.

600 ఏళ్ల నుంచి.. యూకేలోని ఎసెక్స్ నుంచి ఫౌల్‌ నెస్ ఐలాండ్ వరకు గల సముద్ర తీరంలో 600 ఏళ్ల కిందట నిర్మించిన ఫుట్‌పాత్ ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దానిపై నడుస్తుంటే.. నేరుగా సముద్రంలోకి వెళ్తున్నట్లే ఉంటుంది. పైగా.. అది 600 ఏళ్ల నాటి పుట్ ‌పాత్ కాబట్టి.. పర్యాటకులు దానిపై నడవాలని ఆశిస్తారు. ఈ ఫుట్‌పాత్ సముద్రపు అలలు వల్ల దాదాపు కనుమరుగైంది. సముద్ర మట్టం పెరగడం వల్ల ఎక్కువ శాతం నీటిలోనే ఉంటుంది. దీంతో ఆ మార్గంలో వెళ్లివారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

1419లో ఫౌల్‌నెస్ ఐలాండ్‌కు కాలినడకన వెళ్లేందుకు ఈ ఫుట్‌ పాత్ నిర్మించారు. ఆరు మైళ్ల దూరం ఉండే ఈ మార్గంలో సగ భాగం ఇసుకతో, మిగతా భాగం నీటితో కప్పేసి ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ గుంతలు ఇసుకతో కప్పి ఉండటం వల్ల ప్రమాదకరంగా మారినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆ ప్రాంతాల్లో అడుగు వేస్తే అమాంతంగా ఊబిలోకి కూరుకుపోతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మంది ఈ ఫుట్‌పాత్‌ పై ప్రయాణించి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఈ మార్గానికి ‘డూమ్ వే’ అని పేరు పెట్టారు.

ప్రజల భద్రత కోసం యూకే అధికారులు దీన్ని పూర్తిగా మూసివేశారు. పర్యాటకులకు కూడా ఇక్కడికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇది యూకే మిలటరీ ఆధీనంలో ఉంది. ఈ మార్గంలో ప్రయాణించాలనుకుంటే అనుమతి తీసుకోవాలి. పొగ మంచు కురిసే సమయాల్లో ఈ మార్గం చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. ఒకప్పుడు చాలామంది ఈ మార్గంలో ప్రయాణించి మిస్సయ్యారు. వారంతా సముద్రంలో కొట్టుకుపోవడం లేదా ఇసుక ఊబిలో చిక్కుకుని చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు ఈ పుట్‌పాత్ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో దీనిపై నడవడం కొంతవరకు సులభమే. అయితే, తప్పుడు వేళల్లో ఈ మార్గంలో నడిస్తే మాత్రం.. సముద్రపు అలల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. వెనక్కి వెళ్లే సముద్రపు నీరు.. చాలా వేగంగా తిరిగి ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఒక సాధారణ వ్యక్తి పరిగెట్టే వేగం కంటే స్పీడుగా కెరటాలు దూసుకొస్తాయి. ఆ తర్వాత మార్గం కూడా మూసుకుపోయి.. ఎటువెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

1600 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఇసుక తిన్నెల్లో 66 శవాలు లభ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, చాలామంది ఆచూకీ లేకుండా పోయారని, వారి శవాలు ఇప్పటికీ అంతుచిక్కలేదని తెలిపారు. ఈ బ్రూమ్‌వేలో ప్రజలు ప్రమాదంలో చిక్కుకుంటున్నారనే కారణంతో ప్రభుత్వం 1992లో హెవేంగర్ క్రీక్ నుంచి ఫౌల్‌నెస్‌ కు వంతెన నిర్మించారు.

ఈ ప్రాంతం సైన్యం ఆధీనంలోకి వెళ్లిన తర్వాత.. అనేక యుద్ధ శిక్షణలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని పేలుడు పదార్థాలను ఏర్పాటుచేసినట్లు చెబుతున్నారు. ఎవరైనా పొరపాటున వాటిని తాకితే పేలిపోయే ప్రమాదం ఉందని అక్కడ నోటీస్ బోర్డుల్లో పేర్కొన్నారు. మొదటి ప్రపంచం యుద్ధం నాటి నుంచే ఈ ప్రాంతం సైన్యం ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తే.. సైన్యం కేవలం ఫుట్‌పాత్ ప్రారంభమయ్యే మార్గం వరకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version