ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. సిరిపురం సెంటర్ నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు కొనసాగింది.
అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు నేతలు. ఈ సభకి దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఇక సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలోకి కూరుకిపోయిందని అన్నారు. నేడు మోడీ రాకతో 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో మోడీ వెలుగులు నింపారని కొనియాడారు. బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారని అన్నారు.