దేశంలోని పీఎఫ్ ఖాతాదారులకు Employees Provident Fund Organisation (EPFO) శుభవార్త చెప్పింది. ఇకపై ఖాతాదారులు తమ పుట్టిన తేదీని చాలా సులభంగా సరిచేసుకోవచ్చు. అందుకు గాను ఆధార్ లో ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటున్నామని ఈపీఎఫ్‌వో తెలియజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్‌వో రికార్డుల్లో తప్పుగా ఉన్న తమ పుట్టిన తేదీని ఇక ఆధార్‌తో సరిచేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుందని, కనుక ఖాతాదారులు తమ పుట్టిన తేదీని సరి చేసుకోవడానికి ఆధార్‌ను ఆన్‌లైన్ లో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుందని.. ఈపీఎఫ్‌వో తెలిపింది. అయితే అసలు తేదీ, తప్పుగా ఉన్న తేదీల మధ్య వ్యత్యాసం 3 ఏళ్ల కన్నా తక్కువగా ఉండాలని ఆ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో ఖాతాదారులు పుట్టిన తేదీని సరిచేసుకోవడానికి అప్పీల్ చేస్తే.. ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తవుతుందని, ఇందుకు గాను పీఎఫ్ ఖాతాల ఫీల్డ్ ఆఫీసర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఆ సంస్థ తెలిపింది.
ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తెచ్చిన ఈ సదుపాయంతో ఎంతో సమయం ఆదా కానుంది. దీని వల్ల పీఎఫ్‌ను చాలా మంది విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది.