మనుషులను చంపేస్తున్న ‘పిట్‌ బుల్‌’ జాతి కుక్కలు..ఇప్పటికి 37మందికి పైగా మృతి..

-

ఇవ్వాల రేపు ఏదో ఒక పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరికీ అలవాటుగా మారింది.. కానీ మనం ఏం జంతువును తెచ్చుకున్నామో మనకు వాటిపై పూర్తి అవగాహన ఉండాలి.. ఏది పడితే అది తెచ్చుకోని..చివరికి ఇబ్బందుల పాలవడం అవసరమా..? మొన్న ఓ వ్యక్తి పిల్లి నోట్లో వేలు పెట్టాడు.. సీన్‌ కట్‌ చేస్తే ఆసుపత్రిపాలై కోలుకోలేక చనిపోయాడు.. ఇప్పుడు ఓ రకం కుక్కలు మనుషులను చంపేస్తున్నాయట.. పిట్ బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులను పీక్కు తింటున్నాయి.. అసలు ఈ కుక్కలేంటి..? ఇవి ఎందుకు అంత క్రూరంగా ఉన్నాయో చూద్దామా..

ఆరోజు ఆదివారం….దక్షిణాఫ్రికాలోని ఫొమొలాంగ్ ప్రాంతంలో ఉదయం ఒక్కసారిగా కేకలు వినపడటంతో ప్రజలు ఉలిక్కిపడి లేచారు. బయటకు వచ్చి చూస్తే అమెరికన్ పిట్ బుల్ జాతికి చెందిన రెండు కుక్కలు… కెకెట్సో సొలే అనే మూడేళ్ల బాలుని మీద దాడి చేస్తున్నాయి. చివరకు ఆ కుక్కలు వాళ్ల కళ్ల ముందే బాలున్ని కొరికి, చీల్చి చంపేశాయి. వాటిని ఎదిరించే ధైర్యం అక్కడ ఉన్న ఎవరికీ లేదు.. ఆ బాలుడు బయట ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఆ రెండు కుక్కలను అక్కడ బోనులో ఉంచుతారు. అయితే స్వేచ్ఛగా తిరగడం కోసం ఆ రోజు వాటిని వదిలేశారు. ఆ కుక్కలు చాలా సేపు దాడి చేసినట్లు బాలుని ఇంట్లో వాళ్లు చెబుతున్నారు.

కొందరు కుక్కల మీద వేడి నీళ్లు పోసి, బాలుని మృత దేహాన్ని పక్కకు లాగారు. ఆ తరువాత కోపంతో స్థానికులు ఒక కుక్కను పట్టుకుని సజీవంగా కాల్చివేశారు. ఆ కుక్కల యజమాని అయిన 21 ఏళ్ల లెబోహాంగ్ పాలీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకరమైన ఇలాంటి కుక్కలను పెంచుతున్నందుకు కేసు నమోదు చేశారు. బాలుని మీద దాడి చేసిన మరొక కుక్కను జంతు సంరక్షణ అధికారులు చంపేశారు.

ఇదేం తొలి మరణం కాదు..
దక్షిణాఫ్రికాలో అమెరికన్ పిట్ బుల్ దాడుల్లో ప్రజలు మరణించిన కేసులు చాలానే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అయిదుగురు చనిపోయారని స్వచ్ఛంద సంస్థ ‘యానిమల్స్ 24-7’ గణాంకాలు చెబుతున్నాయి. గత 18 ఏళ్లలో కేవలం పిట్ బుల్ కుక్కల దాడుల్లోనే 37 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వీరిలో 18 మంది పిల్లలు. ఈ పిల్లల్లోనూ అయిదుగురు ఈ ఒక్క ఏడాదిలోనే చనిపోయారు. 2017లో నలుగురు పిల్లలు మృతి చెందారు. 2016 నుంచి ప్రతి ఏడాది అమెరికన్ పిట్ బుల్ చేతిలో కనీసం ఒక్కరైనా చనిపోతున్నారు.

‘కుక్కలు దాడులు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కుక్కలు కరిచిన కేసులకు సంబంధించి దాదాపు 70 విచారణలు వచ్చాయి. అంటే సగటున నెలకు ఆరు. అక్టోబరులోనే ఆ సంఖ్య 50శాతానికి పెరిగింది’ అని డీఎస్‌సీ అటార్నీస్‌కు చెందిన కిరస్టీ హల్సామ్ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఇంట్లోని పెంపుడు పిట్ బుల్ కుక్కల చేతిలో 10ఏళ్ల స్టామ్ నుకు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో దక్షిణాఫ్రికాలో పిట్ బుల్ జాతి కుక్కలను నిషేధించాలంటూ ఆన్‌లైన్ వేదికగా అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ కుక్కలతో మరో దందా..

అమెరికన్ పిట్ బుల్ జాతి కుక్కలను రక్షణ కోసమే కాకుండా అక్రమంగా కుక్కల పోటీలు నిర్వహించేందుకు కూడా వాడుతున్నారు. పోటీల్లో గెలిచేందుకు వీలుగా కుక్కలను అగ్రెసివ్‌గా మారుస్తారు. పందెంలో ప్రత్యర్థి కుక్కను చంపేలా శిక్షణ ఇస్తారు. అక్రమంగా నిర్వహించే ఈ పోటీల్లో కుక్కల మీద పందేలు కాస్తుంటారు. ఈ ఏడాది జులైలో కేప్‌ టౌన్‌లోని గ్రాసీ పార్క్ వద్ద ఇలా అక్రమంగా నిర్వహించే కుక్కల పోటీలను అధికారులు అడ్డుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో మూడు పిట్ బుల్ జాతి కుక్క పిల్లలు కూడా ఉన్నాయి.

కుక్కల దాడుల సమస్యకు మరొక కారణం వాటిని ఇతర జాతి కుక్కలతో బ్రీడింగ్ చేయడం కూడా అని నిపుణులు అంటున్నారు. కుక్కల పందేల కోసం బొయిర్ బోల్స్ వంటి జాతి కుక్కలతో పిట్ బుల్ జాతి కుక్కలను క్రాస్ బ్రీడ్ చేస్తున్నారట.. ఇలా పుట్టిన కుక్కలు చూడటానికి అమెరికన్ పిట్ బుల్ మాదిరిగానే ఉన్నప్పటికీ నైజంలో మాత్రం చాలా దూకుడుగా ఉంటాయి. పిల్లల మీద దాడులు చేస్తాయి. అయితే అమెరికన్ పిట్ బుల్ జాతిని నిషేధించే బదులు కొన్ని రకాల ఆంక్షలు విధించాలని కొందరు సూచిస్తున్నారు. ‘ఆ బ్రీడ్‌ను నిషేధిస్తే రక్షణ కోసం ప్రజలు మరొక జాతి కుక్కలను ఆశ్రయిస్తారు. ఆ తరువాత జర్మన్ షెఫర్డ్ వంటి జాతి కుక్కల దాడులు పెరుగుతాయి’ అని పిట్ బుల్ ఫెడరేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ప్రతినిధి లిన్స్ అన్నారు.

ఏది ఏమైనా.. కుక్కల్లో క్రూరత్వం ఉన్నవి కూడా చాలా ఉన్నాయి.. కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలి.. మనలో చాలామంది.. ఫారమ్‌ బ్రీడ్స్‌ను పెంచుతుంటారు.. ఇలా వాటి గురించి తెలిసితెలియక పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చుకోని అవి పెద్దయ్యకా వాటి లక్షణాలు బయటపడి అవస్థలు పడుతుంటారు.. కాబట్టి.. కుక్కలను పెంచేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏ జాతివి, వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది, లక్షణాలు ఏంటి, ఏ ఆహారం ఎక్కువగా ఇష్టపడతాయి, వీటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ పిట్‌బుల్‌ జాతి కుక్కల వల్ల చూశారుగా ఏటా ఎంత మంది పిల్లలు బలవుతున్నారో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version