భాద్రపద మాసం పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం జరగబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కావున దీని ప్రభావం మన పైన ఉంటుంది. ఈ గ్రహణం మనకు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడుతుంది. గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు నుంచే కొన్ని నియమాలు పాటించాలి. గ్రహణం 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 1గంట 25 నిమిషాల వరకు ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల అశుభ ఫలితాలను నివారించవచ్చని నమ్ముతారు. ఈ నియమాలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలకు చాలా ముఖ్యమైనవి. ఈ ప్రత్యేక సమయంలో పాటించాల్సిన ముఖ్య సూచనలను పరిశీలిద్దాం..
హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడడానికి కొంత సమయం ముందు, గ్రహణం సమయంలో గ్రహణం తర్వాత కొంత సమయం కలిపి సూతక కాలం అని అంటారు. చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూత కాలం మొదలవుతుంది. ఈ కాలంలో దేవాలయాలు మూసివేస్తారు. పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత గుడి శుభ్రం చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి వాటిని తెరిచి పూజలు చేస్తారు.
గ్రహణం సమయంలో పాటించాల్సిన నియమాలు:
ఆహారం నీరు: గ్రహణం ప్రారంభమయ్యే సుమారు మూడు గంటల ముందు నుంచి ఆహారం నీరు తీసుకోవడం మానివేయాలి. పెద్దలు, ఆరోగ్యం సరిగా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటారు. గ్రహణం పూర్తి అయిన తరువాత భోజనం చేయాలి .ఇంట్లో వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలంటే వాటిలో కొన్ని దర్భగడ్డి లేదా తులసి ఆకులను ఉంచాలి.

పూజా కార్యక్రమం: గ్రహణం సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. ఈ సమయంలో ఇంట్లో కూడా పూజలు, భజనలు చేయకూడదు. గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రం చేసి ఆ తర్వాత పూజ చేయాలి.
గర్భిణీ స్త్రీలు : గ్రహణం అంటే ముఖ్యంగా చెప్పుకునేది గర్భిణీ స్త్రీల గురించే, ఈ సమయంలో బయటకు వెళ్లడం గర్భిణీ స్త్రీలు మానుకోవాలి. ఎందుకంటే గ్రహణం నుంచి వచ్చే ప్రతికూల కిరణాలు శిశువుపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ఈ సమయంలో వారు విశ్రాంతి తీసుకోవాలి. దేవుడి నామాలను మనసులోనే జపిస్తూ ఇంట్లోనే ఉండడం మంచిది.
స్నానం: గ్రహణం పూర్తయిన తర్వాత తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. కొంతమంది పట్టు విడిపు స్నానాలు అని గ్రహణానికి ముందు గ్రహణం తరువాత స్నానం చేసే ఆచారాలను కలిగి ఉంటారు. కొందరు గ్రహణం తర్వాతే స్నానం చేస్తారు.
గ్రహణం తర్వాత చేయవలసిన పనులలో ముఖ్యంగా దానం చెప్పుకోదగినది గ్రహణం పూర్తయిన తర్వాత పేదవారికి ఆహారం, వస్త్రాలు, డబ్బు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఇంటిని పూజ గదిని శుభ్రం చేసి గంగాజలం లేదా పసుపు నీళ్ళు చల్లడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం హిందూ సాంప్రదాయాలను, నమ్మకాలను అనుసరించి ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత నమ్మకాలు ఆచారాలు భిన్నంగా ఉండవచ్చు. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే