మన దేశంలో సైంటిస్టులు మాత్రమే కాదు, రైతులు కూడా ఆయా పంటలకు చెందిన నూతన వంగడాలను సృష్టించగలరు. గతంలో ఎంతో మంది రైతులు అలా చేశారు. ఇక తాజాగా ఇంకో రైతు కూడా అలాగే ఓ పంటకు గాను నూతన రకం వంగడాన్ని సృష్టించాడు. అయితే అతను ఇప్పుడు మన మధ్య లేకున్నా అతను సృష్టించిన వంగడం మాత్రం అద్భుతాలు సృష్టిస్తోంది.
గుజరాత్‌లోని జునాగఢ్ ప్రాంతం ఖామ్ద్రోల్ గ్రామానికి చెందిన అరవింద్ భాయ్ వల్లభాయ్ మార్వనియా అనే రైతు ఓ నూతన రకం క్యారెట్ వంగడాన్ని ఎంతో శ్రమించి సృష్టించాడు. ఆ వెరైటీని పండించేందుకు తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ నీళ్లు అవసరం అవుతాయి. కానీ దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇక అందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ క్యారెట్ సాధారణ క్యారెట్ కన్నా పొడవు ఎక్కువగా ఉంటుంది. పింక్ కలర్లో ఉంటుంది. అందులో సాధారణ క్యారెట్‌తో పోలిస్తే బీటాకెరోటీన్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. బీటాకెరోటీన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి సమస్యలను తగ్గిస్తుంది.
అయితే వల్లభాయ్ సృష్టించిన కొత్త క్యారెట్ వంగడాన్ని ఇప్పటికే 10 రాష్ట్రాల్లో పండిస్తూ రైతులు లాభాలను గడిస్తున్నారు. దీనికి ఖర్చు తక్కువే, నీళ్లూ తక్కువగానే అవసరం అవుతాయి. లాభాలు అధికంగా పొందవచ్చు. కానీ అరవింద్ భాయ్ 2 నెలల కిందటే చనిపోయాడు. అయినప్పటికీ అతని క్యారెట్ వంగడానికి మాత్రం ఎంతగానో పేరు వచ్చింది. అతను చనిపోయేనాటికి అతనికి 98 ఏళ్లు. తన తాతల కాలం నుంచే అతను వ్యవసాయం చేస్తూ ఎన్నో మెళకువలను నేర్చుకున్నాడు. అందులో భాగంగానే ఆ కొత్త క్యారెట్ వెరైటీని సృష్టించాడు. ఇక వల్లభాయ్‌కి 2015లో సృష్టి ఇన్నోవేషన్ అవార్డు, 2017లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డులు లభించాయి. అలాగే ఆయన పద్మ శ్రీని కూడా అందుకున్నాడు.