మన చేతిలో ఉండే ప్రతి కరెన్సీ నోటుపై చిరునవ్వు చిందించే మహాత్మా గాంధీ కనిపిస్తారు. కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే నోట్లపై గాంధీ గారి బొమ్మ రాలేదని మీకు తెలుసా? ఒకప్పుడు మన నోట్లపై అశోక చక్రం, పులులు, ఆఖరికి ఇండస్ట్రియల్ యంత్రాల చిత్రాలు కూడా ఉండేవి. మరి గాంధీ ఫొటో ప్రయాణం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఈ ఆసక్తికరమైన చరిత్రను, నోట్ల వెనుక ఉన్న గుట్టును తెలుసుకుందాం ..
స్వతంత్రం తర్వాత తొలి మార్పులు: 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, కొంతకాలం పాటు బ్రిటిష్ రాజు బొమ్మ ఉన్న నోట్లే చలామణిలో ఉన్నాయి. 1949లో భారత ప్రభుత్వం తొలిసారిగా కొత్త నోట్లను విడుదల చేసింది. అప్పుడు గాంధీ గారి ఫొటో పెట్టాలని చర్చ జరిగినప్పటికీ, చివరికి సారనాథ్‌లోని ‘అశోక స్తంభం’ చిహ్నాన్ని ఎంచుకున్నారు.
ఆ తర్వాత కాలంలో నోట్లపై మన దేశ ప్రగతికి చిహ్నంగా ఆర్యభట్ట శాటిలైట్, ట్రాక్టర్లు మరియు వ్యవసాయ రంగ చిత్రాలను ముద్రించేవారు. 1969లో గాంధీ గారి వందవ జయంతి సందర్భంగా తొలిసారిగా ఆయన స్మారకార్థం ‘సేవాగ్రామ్ ఆశ్రమం’ నేపథ్యంలో ఉన్న చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు.

గాంధీ సిరీస్ నోట్ల వచ్చింది అప్పుడే: మనం ఇప్పుడు చూస్తున్న నవ్వుతున్న గాంధీ గారి ఫొటో పూర్తిస్థాయిలో నోట్లపైకి రావడానికి చాలా సమయం పట్టింది. 1987లో తొలిసారిగా 500 రూపాయల నోటుపై గాంధీ గారి ముఖచిత్రాన్ని ముద్రించారు. అయితే, అన్ని రకాల కరెన్సీ నోట్లపై (5, 10, 20, 100, 500) గాంధీ గారి ఫొటోను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1996లో నిర్ణయించింది. దీనినే ‘మహాత్మా గాంధీ సిరీస్’ అని పిలుస్తారు. కరెన్సీ ఫోర్జరీని అరికట్టడానికి మరియు ఒక జాతీయ చిహ్నంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో గాంధీ గారి చిత్రపటాన్ని శాశ్వతం చేశారు.
కరెన్సీ నోటుపై మనం చూసే గాంధీ గారి ఫొటో ఏదో ఆర్టిస్ట్ గీసిన చిత్రం కాదు. 1946లో అప్పటి వైస్రాయ్ హౌస్ వద్ద ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తీసిన అసలు ఫోటో అది. ఆ ఫొటోలోని ముఖాన్ని క్రాప్ చేసి నోట్లపై ముద్రించడం ప్రారంభించారు. ఒక సామాన్య మానవుడిగా పుట్టి, అహింసతో దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన బాపూజీ, నేడు ప్రతి భారతీయుడి జేబులో ఆర్థిక లావాదేవీలకు సాక్షిగా నిలవడం గొప్ప విషయం.
