ఆ గ్రామంలో ఉల్లి ధర కేజీ వెయ్యి రూపాయలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు… ఎందుకు…?

-

మహారాష్ట్రలో వర్షాల పుణ్యమా అని దేశంలో ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది. భారీగా మహారాష్ట్రలో ఉల్లి పంటలు నాశనం కావడంతో అక్కడి నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. ఇక రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉల్లిపాయల రిటైల్ రేటు కిలోకు రూ .70 కు పెరిగి కిలోకు రూ .100 కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే 100 నుంచి 150 వరకు పలుకుతుందని వార్తలు వస్తున్నాయి. 

ఇక బీహార్ లో ఉల్లి ధర ప్రస్తుతం 80 వరకు ఉండటంతో అక్కడి ప్రభుత్వం ధరలు తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టింది. బీహార్ రాజధాని పాట్నాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి బీహార్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ అసోసియేషన్ లిమిటెడ్ (బిస్కోమన్) గత కొన్ని రోజులుగా ఉల్లిపాయలను కిలోకు రూ .35 చొప్పున సరఫరా చేస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటి అంటే… పాట్నాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెహానాబాద్ జిల్లాలోని చిరి పంచాయతీలోని త్రిలోకి బిఘా గ్రామంలో ఉల్లి ధర 1000 రూపాయలు ఉన్నా అక్కడి ప్రజలు పట్టించుకోరు.

ఎందుకంటే అసలు అక్కడ ఉల్లిపాయే వాడరు. ఈ గ్రామంలో 35 కుటుంబాలు ఉన్నాయి మరియు జనాభా 300 నుండి 400 మంది. ఈ గ్రామంలో విష్ణువు ఆలయం ఉన్నందున ఈ గ్రామ ప్రజలు శతాబ్దాల నుండి ఉల్లిపాయలు తినడం మానేశారట. ఈ గ్రామంలోని ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన శాఖాహారులు మరియు ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని తినరు. గ్రామంలో ఎవరూ మద్యం కూడా తాగరట. గతంలో ఉల్లిపాయలు తిన్న కొందరు గ్రామస్తులు ప్రమాదాలకు గురయ్యారని అందుకే ఇక అప్పటి నుంచి బయటకు వెళ్ళినా సరే ఉల్లిపాయ వాడని ప్రదేశంలోనే భోజనం చేస్తారని రాం ప్రకాష్ యాదవ్ అనే వ్యక్తి చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version