రెయిన్‌కోట్లు, బ్రాలు వాషింగ్‌ మెషిన్‌లో వేయొచ్చా..? ఇలాంటి మరకలు పడిన బట్టలు వేస్తే మంటలే

-

ఈరోజుల్లో చేత్తో బట్టలు ఉతికేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఉరుకులపరుగులు జీవితం, సరిగ్గా వండుకోని తినడానికే టైమ్‌ ఉండటం లేదు. ఇంక బట్టలు ఎక్కడ ఉతికేది.. వాటిని పిండి ఇంకా ఎక్కడ ఆరేసింది.. అదే వాషింగ్‌ మెషిన్‌లో వేస్తే..మనం వేరే పనులు చేసుకునేలోపు మిషన్‌ దానిపని అది చేసి.. శుభ్రంగా ఉతికి మొత్తం పిండేసి ఇస్తుంది. అంతే వాటిని మనం తీసి ఆరేశాం అంటే అరగంటలో ఆరిపోతాయి. అయితే వాషింగ్‌ మిషన్‌లో కొన్ని వేయకూడనివి కూడా ఉంటాయి. మనం తెలిసితెలియక వాటిని వేశాం అంటే.. కొన్నిసార్లు ప్రమాదాలు జరగొచ్చు, మరికొన్నిసార్లు మిషన్‌ పాడవ్వొచ్చు, లేదా బట్టలు కూడా చెడిపోవచ్చు. అసలు వాషింగ్‌ మెషిన్‌లో వేయకూడనివి ఏంటి..?

దుప్పట్ల లాంటి బరువైన లాండ్రీని ఎప్పుడూ మామూలు బట్టలతో కలిపి లోడ్ చేయవద్దు. అలాగే అన్ని లాండ్రీలను ఒకే లోడ్‌లో ఉతికేద్దాం అని అనుకోవద్దు. అలా చేస్తే లోడ్ ఎక్కువై మీ మెషిన్ దెబ్బతింటుంది. అలాగే లాండ్రీ కూడా సరిగా క్లీన్ అవ్వవు.

మనం ఏం వేస్తున్నామనేది వాషింగ్ మెషిన్‌కి తెలీదు. సున్నితంగా ఉండే ఫోమ్ దిండును వాషింగ్ మెషిన్‌లో వేస్తే అది ఇట్టే చిరిగిపోతుంది. లోపల అల్లకల్లోలం అయిపోతుంది. దెబ్బకి మిషన్‌ పాడవుతుంది.

మంటలు వచ్చే అవకాశం ఉండే మరకలు బట్టలపై పడితే అంటే కిరోసిన్, గ్యాసోలిన్, మద్యం, పెట్రోల్, వంటివి బట్టలపై పడితే.. ఆ బట్టలను వాషింగ్ మెషిన్‌లో ఉతకడం మంచిది కాదు. వాటి వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి.

టైలు సాధారణంగా పట్టు లేదా ఉన్నితో తయారవుతాయి. వాటిని కుట్టే విధానం చాలా సున్నితంగా ఉంటుంది. వాటిని మెషిన్‌లో కడిగితే దెబ్బతింటాయి. అదేవిధంగా మెషిన్‌లో ఫ్యాన్సీ లేదా ప్యాడెడ్ బ్రాలను కడగడం కూడా మానుకోవాలి. ఎందుకంటే అలా కడిగితే, బ్రా ఆకారం, అండర్ వేర్ దెబ్బతింటుంది. అలాగే మెటల్ క్లచ్‌లు లోపలి భాగాలకు చిక్కుకోవచ్చు.

ఎవరూ ఉద్దేశపూర్వకంగా నాణేలు లేదా ఏదైనా లోహపు వస్తువును యంత్రంలో ఉంచరు. కానీ, ఇలా పొరపాటున జరిగితే, అది వాషింగ్ మెషిన్‌ను దెబ్బతీస్తుంది. అందుకే మెషిన్‌లో బట్టలు వేసే ముందు కచ్చితంగా బట్టల జేబులు చెక్ చేయాలి. ఇప్పుడు కొన్ని మిషన్లు ఇలా పొరపాటున పడిన నాణేలను సపరేట్‌ చేసి వేరే దగ్గరకు పంపిస్తున్నాయి.

రెయిన్‌కోట్‌లు వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి. అవి వాషింగ్ మెషిన్ లోపల నీటిని గ్రహించవు. రెయిన్‌కోట్‌లు నీటిని బెలూన్‌లా బంధిస్తాయి. మెషిన్ వాటిని కడిగినప్పుడు అవి పగిలిపోయి భారీ గందరగోళం సృష్టిస్తాయి. సో వీటిని వాషింగ్‌ మిషన్‌లో వేయకపోవడమే బెటర్ మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version