బర్త్ డేలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎవరికైనా ఇష్టమే. స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ క్యాండిల్స్ ఊది, కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకోవడం కన్నా ఆనందకరమైన విషయం ఇంకొకటి ఉండదు కదా. అందుకే చాలా మంది బర్త్‌డే పార్టీలకు అంత ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే ఇది సరే.. కానీ అసలు బర్త్‌డేలకు క్యాండిల్స్ ఊదడం, కేక్ కట్ చేయడం మన సంప్రదాయం అయితే కాదు కదా. మరి ఇది అసలు ఎలా వ్యాప్తి చెందింది ? అసలు బర్త్ డేలకు కేక్ ఎందుకు కట్ చేస్తారు ? అంటే.. ఎవరికీ ఈ విషయం అయితే తెలియదు. కానీ.. ఈ పద్ధతి ఎలా వాడుకలోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
బర్త్‌డేలకు క్యాండిల్స్ ఊది, కేక్ కట్ చేయడం అన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. 1808వ సంవత్సరంలో ఇది ప్రారంభమైందని చెబుతారు. జర్మనీలో అప్పట్లో కిండర్‌ఫెస్ట్ పేరిట కేవలం పిల్లలకు మాత్రమే బర్త్ డే వేడుకలను నిర్వహించేవారట. ఆ సమయంలో వారు ప్రత్యేకంగా బర్త్ డే కేకులను తయారు చేసి దానిపై పిల్లల వయస్సును బట్టి నిర్దిష్టమైన సంఖ్యలో క్యాండిల్స్ ఉంచి వాటిని ఊదించి, ఆ తరువాత కేక్ కట్ చేయించేవారట. ఆ తరువాత ఇది నెమ్మదిగా ఇతర దేశాలకూ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం మనం కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాం.
అయితే జర్మన్లే కాదు, గ్రీకులు కూడా ఒకప్పుడు ఇలాంటి సంప్రదాయమే పాటించేవారట. కానీ వారు క్యాండిల్స్‌ను ఊదడానికి బదులుగా బాగా వెలుగు వచ్చేలా వెలిగించేవారట. ఇక క్యాండిల్స్‌ను అలంకరించిన ఆ కేకును ముందుగా ఆర్టెమిస్ టెంపుల్‌లో ఉంచి ఆ తరువాత బర్త్‌డేలను జరుపుకునేవారట. ఇక కొంత మంది అయితే.. కేకుపై క్యాండిల్స్‌ను ఉంచి వాటిని ఊదితే అప్పుడు వచ్చే పొగతో దేవున్ని ప్రార్థించినట్లు అవుతుందని నమ్ముతారు. కేకులపై క్యాండిల్స్ ఉంచడం అంటే.. ఆ క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు మన జీవితంలో నిండుతుందని జర్మన్లు భావిస్తారట. ఇక కేకుపై ఉన్న క్యాండిల్స్‌ను అన్నింటినీ ఒకేసారి ఊదితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని, దేవుడి ఆశీస్సులు మనకు లభిస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. అదేవిధంగా మనం కట్ చేసే సుతిమెత్తని మృదువైన కేకులా మన జీవితం కూడా సాఫీగా సాగాలని కొందరు నమ్ముతారు. ఇవీ.. బర్త్ డేకు కేక్ ను కట్ చేయడం వెనుక దాగి ఉన్న ఆసక్తికర విషయాలు..!