ఎరుపు రంగును చూస్తేనే ఎద్దులు ఎందుకు దాడి చేస్తాయి ? ఎరుపంటే వాటికి ఇష్టం ఉండ‌దా ?

-

ఎరుపు రంగును చూడ‌గానే ఎద్దులు కోపంతో ప్ర‌వ‌ర్తిస్తాయ‌ని, అడ్డు వ‌చ్చిన వారిని కొమ్ముల‌తో కుమ్మేస్తాయ‌ని చెబుతుంటారు. ఇలాంటి స‌న్నివేశాల‌ను మ‌నం సినిమాల్లోనూ చాలా చూశాం. ఇక స్పెయిన్ దేశంలో అయితే బుల్ ఫైట్‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌ల్లో ఉండే బుల్ ఫైట‌ర్స్ ఎద్దుల‌కు ఎరుపు రంగు వ‌స్త్రాల‌ను చూపుతూ వాటిని రెచ్చ‌గొడుతుంటారు. ఆ ఫైట్‌ను చూసేందుకు స్పెయిన్ ఏటా ఎన్నో కోట్ల మంది కూడా వ‌స్తుంటారు. అయితే ఎద్దులు నిజంగానే ఎరుపు రంగును చూస్తే కోపంగా ప్ర‌వ‌ర్తిస్తాయా ? ఎరుపు అంటే వాటికి ఎందుకంత కోపం ? దీని వెనుక ఉన్న అస‌లు కారణాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

భూమిపై ఉండే జీవులన్నింటిలోనూ కోతులు, గొరిల్లాలు, మ‌నుషులు మాత్ర‌మే అన్ని రంగుల‌ను చూడ‌గ‌ల‌రు. మిగిలిన ఏ జీవులూ అన్ని రంగుల‌నూ చూడ‌లేవు. ఇక ఎద్దుల విష‌యానికి వ‌స్తే అవి ఎరుపైనా, ఇత‌ర ఏ రంగు అయినా స‌రే వాటికి ఒకే మాదిరిగా క‌నిపిస్తుంది. అంతేకానీ ఎరుపును చూడలేవు. ఎరుపు అంటే వాటికి కోపం ఉండ‌దు. ఎరుపు రంగును చూసి కోపంగా ప్ర‌వ‌ర్తించ‌వు.

అయితే మ‌రి బుల్ ఫైట్ల‌లో ఎరుపు రంగు వ‌స్త్రాల‌నే వాటికి ఎందుకు చూపిస్తారు ? అంటే.. అది ఎంతో కాలం నుంచి వ‌స్తున్న సంప్ర‌దాయం. స్పెయిన్‌లో బుల్ ఫైట్లు ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి ఎరుపు రంగు వస్త్రాల‌నే వాటికి చూపించ‌డం మొద‌లు పెట్టారు. అది అలాగే కొన‌సాగుతూ వ‌స్తోంది. అంతే.. ఇందులో విశేష‌మేమీ లేదు.

ఇక ఇదే విష‌య‌మై కొంద‌రు సైంటిస్టులు ప్ర‌యోగాలు కూడా చేశారు. ఎరుపు, నీలం, ఆకుప‌చ్చ త‌దిత‌ర రంగులు ఉన్న మ‌నుషుల‌ను పోలిన బొమ్మ‌ల‌ను ఎద్దుల ఎదురుగా ఉంచారు. అయితే అవి అన్ని బొమ్మ‌ల‌ను అటాక్ చేశాయి. అంతేకానీ కేవ‌లం ఎరుపు బొమ్మ‌ల మీదే దాడి చేయ‌లేదు. అయితే అవి కోపంగా ప్ర‌వ‌ర్తించేందుకు కూడా కార‌ణం ఉంది. ఎద్దుల ఎదుట ఏ రంగు వ‌స్త్రం అయినా లేదా ఇతర ఏ వ‌స్తువును అయినా స‌డెన్‌గా క‌దిలించినా, మ‌నుషులు స‌డెన్‌గా క‌దిలినా.. వాటికి కోపం పెరుగుతుంది. అందుక‌నే అవి దాడి చేస్తాయి. అంతేకానీ ఎరుపు రంగును చూస్తేనే అవి దాడి చేస్తాయ‌ని అనుకోవ‌డం స‌రికాదు.

ఇక స్పెయిన్‌లో బుల్ ఫైట్‌కు ఉప‌యోగించే ఎద్దులు ప్ర‌త్యేక జాతికి చెందిన‌వి. అవి స‌హజంగానే కోపంతో ఉంటాయి. వాటిని ఇంకా కోపం క‌లిగి ఉండేలా పెంచుతారు. అందువ‌ల్ల అవి స‌హ‌జంగానే మైదానంలో త‌మ ఎదుట ఉండేవారు ఇచ్చే స‌డెన్ మూవ్‌మెంట్ల‌కు కోపం చెంది వారిపై దాడి చేస్తాయి. అంతేకానీ.. ఎరుపుకు, అవి కోపంగా దాడి చేసేందుకు సంబంధ‌మే లేదు. ఎవ‌రు స‌డెన్‌గా క‌దిలినా అవి దాడి చేస్తాయి. అందుక‌నే ప‌శువులు, ఇత‌ర జీవుల ముందు నుంచి వెళ్లేట‌ప్పుడు ప‌రిగెత్త‌కూడ‌ద‌ని, నిదానంగా వెళితే అవి మ‌న‌ల్ని ఏమీ చేయ‌వ‌ని చెబుతుంటారు. ఇదీ అస‌లు విష‌యం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version