వానలు అకాలంలో వచ్చి అకాలంలో పోతాయి
అన్యం అయినవి కొన్ని అనర్థంగా తోచి కాలాన్ని
తిట్టుకునేలా చేస్తాయి.. ఈ కాలం ఎలాంటిది అని
అంచనా వద్దు కానీ ఉన్నంత వరకూ కాలాన్ని నిందించడం
మానుకోవడమే పరమ కర్తవ్యం అని చదివేను.
మిగిలిన వేసవిలో ఉత్పాతాలు ఎన్ని ఉన్నా భరించి సహించి వెళ్లండి
అదే మీకో విహితం అయిన కర్తవ్యం….
లోపల నిక్షిప్తం అయి ఉంటుంది. లోకంలో ఇన్ని తప్పులు ఇన్ని పాపాలూ చేశాక కూడా ప్రకృతి క్షమించడం బాలేదు. నేల తల్లి క్షమించడం అస్సలు బాలేదు. కనుక వేసవి మిగిలి ఉంది.. అని ఈసురోమనకండి.. అది కూడా మనం చేస్తున్న పాపంలో భాగం.. చేసుకున్న పుణ్యం ఏదీ లేదు కనుక పవిత్రం అయిన కాలం ఏదీ విషాద ఛాయ లేకుండా పలకరించడం లేదు.
ఒకప్పుడు వేసవి కాలం వేరు..ఇప్పుడు వేరు. బిడ్డల చదువులు విలువలు అన్నవి ఏ విధంగా పద్ధతీ పాడూ లేకుండా పోతున్నాయో అదే విధంగా ఈ వేసవి కూడా పద్ధతీ పాడూ లేకుండానే ఉంది. కాలానికో విలువ ఇచ్చి మనం మాట్లాడడం మానుకున్నాం. విధిగా చేయాల్సిన పనులు కూడా మానుకున్నాం. తిండికీ, వ్యవహార శైలికీ సంబంధం అన్నది లేకుండానే బతికేస్తున్నాం. కనుక కాలం చేసే శాసనం, కాలం ఇచ్చిన శాపం వీటన్నింటినీ అర్థం చేసుకోవాలి. వరాలే కాదు ప్రకృతి ఇచ్చే శాపాలను కూడా భరించాలి. అది కూడా బాధ్యతే !
ఇప్పుడు అక్కడక్కడ వానలు కురుస్తాయి. ఎండలు మాత్రం మండిపోతాయి. ప్రకృతి ఒకటి గతి తప్పింది అని చెప్పేందుకు ఎందుకో చాలా మంది మొహమాట పడుతున్నారు. ఒకప్పుడు మోహవశాన మనుషులు ఉండేవారు. ప్రేమ సంబంధం అంతా ప్రకృతితోనే మిళితం అయి ఉండేది. కాలం మారిపోయేక ప్రకృతితో పాటూ మనుషులు కూడా మారిపోయేక కాదు కాదు మనుషులంతా ఎవరికి వారే అర్థం కాని రీతిలో మారిపోయేక మనం ఎకో బ్యాలెన్స్ ను కోరుకోవడం ఓ అవివేకం. ఆ విధంగా మే నెలలో తీవ్ర తుఫాను ఒకటి వచ్చింది వెళ్లింది. మా శ్రీకాకుళం మొదలుకొని మిగతా ప్రాంతాలు అన్నీ కూడా భయంతో వణికిపోయాయి. వేసవి తుఫానులు ప్రమాదకారులు కావని ముందు అనుకున్నా ఈ సారి మాత్రం అసని అందుకు మినహాయింపు అందుకుంది. ఇది కూడా మనుషుల పాపమే ! ప్రకృతి చేయాలనుకున్న వినాశనం అన్నది మనిషి చేసే వినాశనానికి ప్రతిఫలం అని గుర్తించడం ఎప్పుడో మానుకున్నాం. వద్దనుకున్నాం కూడా ! ఆ విధంగా మనం మారిపోయి ప్రకృతిని పరిసరాన్నీ సంబంధిత నేపథ్యాన్నీ తిట్టుకుంటున్నాం. మనుషుల్లో ఉన్న అనైతికత కారణంగానే గతి తప్పిన వానలు కొన్ని ఈ వేసవిలో పలకరించి వెళ్లాయి. కనుక ఈ వేసవి ఇంకా మిగిలే ఉంది. తీవ్ర తాపం ఒకటి వేధించక తప్పదు.