తెలంగాణలో ఉనికిని చాటుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. హరికృష్ణ బతికి ఉన్నట్లైతే కాంగ్రెస్ – తెదేపా అనైతిక పొత్తును ఖచ్చితంగా వ్యతిరేకించేవారన్నారు. దీని ప్రభావం ఏపీలో ఉంటుందని తలసాని జోష్యం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ఏకమై ఏర్పాటు చేసుకున్న మహాకూటమిపై వంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేవలం కొన్ని సీట్ల కోసం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏర్పాటైన టీడీపీ, చివరికి కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో 119 స్థానాల్లో పోటీ చేస్తానన్న ఆయన కేవలం 4 సీట్ల కోసం కూటమిలో చేరడం అమరవీరులను అవమానించడమేనన్నారు.
నాడు కాంగ్రెస్ తెలుగు వాళ్లను కించ పరిచిందని, సీఎం అంజయ్యను అవమానించారని తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించారు. నేటికీ ఎన్టీఆర్ అనే పేరు కారణంగానే టీడీపీ నడుస్తోంది. ఆత్మగౌరవం కోసం స్థాపించిన టీడీపీ విలువలకు విరుద్ధంగా సాగుతోంది. ఎన్నికల్లో సీట్ల కోసం బద్ధ విరోధులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలపడాన్ని ఆ పార్టీల నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.