బంగాళఖాతంలో ఏర్పడిన టిట్లీ తుపాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. గురువారం తెల్లవారు జామున తీరం దాటుతున్న సమయంలో భారీ విధ్వసం సృష్టించింది. ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణిస్తున్న తుపాను ప్రభావం ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం 4గంటల నుంచే తుపాను ప్రభావంపై కలెక్టర్లు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.