మహారాష్ట్ర అకోలాలోని ప్రభుత్వ వైద్య కళాశాల – ఆస్పత్రికి (జిఎంసిహెచ్) ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మహారాష్ట్ర మంత్రి బచ్చూ కడు చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం అకోలా జిల్లా మంత్రి అయిన కడు ఆసుపత్రికి సడన్ విజిట్ కోసం వచ్చారు, ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఫుడ్ కాంట్రాక్టర్‌ను కడు చెంపదెబ్బ కొడుతున్న ఒక వీడియో బయటపడింది. ఆసుపత్రి సందర్శనలో, కోవిడ్ -19 తో బాధపడుతున్న రోగులతో సహా మిగతా రోగులకు అందిస్తున్న భోజనాన్ని కడు పరిశీలించారు.
ఈ క్రమంలోనే ఆహార పదార్థాలు నాణ్యత లేనివిగా ఉన్నాయని తెలుసుకున్న ఆయనకు కోపం వచ్చింది. దీంతో ఆయన భోజన నాణ్యత మరియు ఇతర సమస్యలపై వివరణ కోరడానికి ఫుడ్ కాంట్రాక్టర్‌ను పిలిపించాడు, అయితే సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదని భావించి కడు ఆ కాంట్రాక్టర్ ను ని చెంపదెబ్బ కొట్టాడు. తరువాత, మీడియాతో మాట్లాడిన కడు, నాణ్యత లేని భోజనం, ఆహార సామాగ్రికి సంబంధించిన రికార్డులను నిర్వహించకపోవడంపై విచారణ జరపాలని జిల్లా సబ్ డివిజనల్ అధికారిని కోరినట్లు చెప్పారు.