మహబూబ్ నగర్ నుంచి భాజపా ఎన్నికల శంఖారావాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూరించారు. స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… నేటి వరకు ముందస్తుకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వివరించలేదు.. రానున్న ఎన్నికల్లో భాజపా గెలుపుని ఎవ్వరూ ఆపలేరూ అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను దేశవ్యాప్తంగా హైదరాబాద్ విమోచన దినాన్ని జరుపుతామని హామి ఇచ్చారు. కేంద్రంలో రాహుల్ గాంధీ పట్టపగలే కలలు కంటున్నారని, నైతికి విలువలను తుంగలో తొక్కి కాంగ్రెస్ – తెదేపా పొత్తుకు సిద్ధపడటం విడ్డూరం అన్నారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..తెరాస ను ఓడించే సత్తా భాజపాకు మాత్రమే ఉందన్నారు. మజ్లిస్ పార్టీని కాంగ్రెస్, తెదేపా, తెరాసలు పాలు పోసి పంచుతున్నాయని ఎద్దేవా చేశారు. మజ్లిస్ నేతలపై సామాన్య కార్యకర్తను బరిలో నిలిపి హైదరాబాద్ పార్లమెంటుని కైవసం చేసుకుంటామన్నారు. భాజపా సింహం లాంటిది.. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెరాస ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, తెదేపా, తెజస, ఇతర పార్టీలు కలిసి పోరాటం చేయడం వల్ల వారి బలహీనతలు చెప్పకనే చెప్పారని విమర్శించారు.