రానున్న సీజన్ లో తెలంగాణలో రైతులు వేయాల్సిన పంటపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన చేశారు. అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డితో కలసి ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా అధికారులు నిరంతరం ప్రత్యేక కృషిచేయాలని సూచించారు. జిల్లాలో పెరుగిన నీటి వనరులు ఆధారంగా ఈ వనాకాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 561 ఎకరాలలో ఉద్యాన పంటలు రైతులు సాగు చేస్తున్నారని రాబోవు సంవత్సరాలలో రైతులు మరింత ఉద్యాన సాగు చేసేలా కృషి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.