స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజయ్యకే కేటాయించిన టికెట్ మార్చేది లేదు.. అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక వేళ రాజయ్యపై ఎవరికైనా వ్యతిరేకత ఉంటే తెరాస అధినేత కేసీఆర్ ని చూసి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు నేను అండగా ఉంటా…అంటూ ప్రకటించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సోమవారం మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి రాజయ్యతో పార్టీకి కలిగే నష్టాన్ని వివరించారు… ఈ సమావేశానికి కడియం శ్రీహరి హాజరు కాగా అభ్యర్థి రాజయ్యను కూడా కేటీఆర్ ఆహ్వానించారు.. ఉభయుల సమస్యలను విన్న తర్వాత… స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేసి రాజయ్య విజయానికి సహకరించాలని సూచించారు.
తొలి జాబితాలోని 105 సీట్లలో ఒక్కరినీ మార్చేది లేదు. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ రాజయ్య తెరాసను వీడలేదు. నమ్మకంగా ఉన్నారు కాబట్టే ఆయనకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. మీ సమస్యలు ఉంటే నాకే చెప్పండి. పార్టీలో వర్గాలున్నప్పుడు వ్యతిరేకత సహజం. ఒక్క స్థానంలో అభ్యర్థిని మార్చినా సరే గందరగోళమవుతుంది. విజయం కోసం కష్ట పడి పనిచేసివారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతా క్రమశిక్షణతో నడుచుకోవాలని, తెరాసను గెలిపించాలని, మొండి పట్టుదలకు పోవద్దని అన్నారు. ‘‘పార్టీని వీడాలనుకుంటే, నష్టం చేయాలనుకుంటే మీ ఇష్టం. అధిష్ఠానం మాత్రం ఇలాంటివి సహించద’’ని తీవ్ర స్వరంతో చెప్పారు.