ఒక్క ఓటుతో నాలుగు పార్టీలను బొందపెట్టాలి..హరీశ్ రావు

-

తెలంగాణ ప్రజలు త్వరలో జరగనున్న ఒక్క ఓటుతో నాలుగు పార్టీలను బొందపెట్టాలని మంత్రి హరీశ్ రావు కోరారు. కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన గొల్లకురుమ సంఘం ప్రతినిధులు హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని కాంగ్రెస్‌ నేతలు దిల్లీలో కేసులు వేశారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పెద్ద పులుల ఆవాసం దెబ్బతింటుందని, అడవులు ధ్వంసమవుతాయని అసత్యాలు చెబుతూ దిల్లీలో కేసులు వేశారని మండిపడ్డారు. వాళ్లు చేయరు.. చేసేవాళ్లకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస 100 సీట్లతో అధికారంలోకి వచ్చి చరిత్రను తిరగరాయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

కొడంగల్‌ అభివృద్ధి కావాలంటే గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. పక్కరాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ అనేక కేసులు వేస్తుంటే ఆ పార్టీతో కాంగ్రెస్ దోస్తీ పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యాం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కార్నూలు సభలో మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని హామి ఇచ్చారు. అలా జరిగితే తెలంగాణలోని అన్ని కంపెనీలు ఏపీకి తరలిపోతాయని పేర్కొన్నారు. అలాంటి పార్టీలు అన్ని ఏకమై నేడు తెరాసపై పోరు సిద్ధమవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version