కేరళ అల్లకల్లోలమయింది. భారీ వర్షాలకు, వరదలకు కేరళ మునిగిపోయింది. దీంతో వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళకు సాయం అందించడానికి కోట్ల మంది ముందుకొచ్చారు. చాలా మంది తమ వంతు సాయాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. రిలయన్స్ ఫౌండేషన్ కూడా కేరళ వరద బాధితులకు అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.21 కోట్ల విరాళాన్ని అందజేసింది. దాంతో పాటుగా రూ.50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా ఆపన్నహస్తం అందిస్తూ.. సహాయ చర్యల్లో తమ వంతు సాయం చేస్తోంది.
వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే రిలయన్స ఫౌండేషన్ సహాయక చర్యల్లో పాల్గొన్నది. ఆగస్టు 14 నుంచి వయనాడ్, త్రిస్సూర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో వాలంటీర్లు పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ తరుపున 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారపదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్‌ను పంపిణీ చేస్తోంది. అలాగే.. కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు జియో ప్రకటించింది.