నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలైన్‌ను త్వరలోనే కలుపుతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఫేజ్-1లో పాత బస్తీ మెట్రో మినహా మిగిలినవి ఈ ఏడాది పూర్తి చేయనున్నట్లు వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో రైళ్ల సమయాలను మార్పు చేస్తామని తెలిపారు.
ఎల్బీనగర్- మియాపూర్ మెట్రో మార్గాన్ని గవర్నర్ నరసింహన్ నిన్నమధ్యాహ్నం అమీర్‌పేట స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రారంభమైన మెట్రో మార్గంలో ప్రస్తుతం నిత్యం లక్షమందికిపైగా ప్రయాణిస్తున్నారు.. సోమవారం ప్రారంభించిన 16 కి.మీ. మార్గంతో కలిపి హైదరాబాద్‌లో 46 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ట్రాక్ పరిధిలో 8 రైల్వే ఓవర్ బ్రిడ్జీలను నిర్మించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తెలిపారు.
అవసరమైన కొన్ని చోట్ల 60 నుంచి 70అడుగుల ఎత్తున ట్రాక్ వేయాల్సి వచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐదు వేల మిలియన్ లీటర్ల నీటిని ఆదాచేశామని, దాదాపు రెండు వేల వరకు మెట్రో పిల్లర్లను నిర్మించామన్నారు. రెండో దశలో విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రో కలపాలని సీఎం సూచించారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.