రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డంపడుతున్న వారికి బుద్ధిచెంపేందుకే ముందస్తుకు వెళ్లామని తెరాస నేత కేటీఆర్ పేర్కొన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామిలు ఇస్తుందని విమర్శించారు. నాడు కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛను ఇస్తే.. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రూ.1000కి పెంచింది ఇప్పుడు రూ.2000 ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో ఆర్యవైశ్య ఫెడరేషన్ నేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెరాసలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ఓ వైపు సై అంటూనే.. మరోవైపు కోర్టుల్లో కేసులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. అరవై ఏళ్ల పాలన ఆగట్టులో ఉంటే ఉద్యమ సారధి ఈ గట్టున ఉన్నారు…అంటూ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వందకు పైగా స్థానాలను గెలవడంలో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.