తెరాసను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా కుదుటపడలేదు. దీంతో సీట్ల పంచాయతీని ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్దే తెలుసుకుందామని కూటమిలోని పార్టీలు ఢిల్లీ బాటపట్టాయి. ఇందులో భాగంగానే గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగే కీలక భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా.. టీజేఎస్ అధినేత కోదండరాం గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు ‘సేవ్ నేషన్’ పేరుతో భాజపేతర పార్టీలను ఏకం చేయడంలో బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీంతో ఆయన కూడా రాహుల్‌ను కలిసి టీడీపీ సీట్ల విషయంపై మాట్లాడే అవకాశాలున్నాయి. ఢిల్లీ టూర్‌పై కోదండరాం మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసి మహాకూటమి ప్రచారం మొదలుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సీట్ల విషయాన్ని త్వరగా తేల్చకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన వివరించారు.