ముహుర్త కాలంపై ప్ర‌చార‌మే ప్ర‌మాదానికి కార‌ణం

-

గోదావ‌రి పుష్క‌రాల ఘ‌ట‌న‌పై సోమ‌యాజులు క‌మిష‌న్ నివేదిక‌

గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు ముహుర్త కాలం గురించి విస్తృత ప్రచారమే ప్ర‌ధాన‌ కారణమని జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ తేల్చిచెప్పింది. తొక్కిసలాట ఘటనపై జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ సమర్పించిన నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ ముందుకు తెచ్చింది. 144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి గుడ్డి న‌మ్మ‌కంతో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని…  ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పవిత్ర స్నానం చేయాలనే నిబంధన ఎక్కడాలేదని కమిషన్‌  తెలిపింది.

మీడియాలో వ‌చ్చిన అతి ప్ర‌చారం వ‌ల్ల కూడా ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని వెల్లడించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ప్రచారం, రాజకీయ లబ్ది కోసమే చాలామంది ఆరోపణలు చేసినట్టు అభిప్రాయపడింది. ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300మీటర్లు మాత్రమే ఉండటం, పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం వల్లే జనం రద్దీ విపరీతంగా పెరిగిందని తెలిపింది.

నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియోలతో సహా అన్ని వీడియోలను పరిశీలించిన కమిషన్ ఈ ప్ర‌మాదాన్ని ఇత‌ర పార్టీలు రాజ‌కీయ విమర్శలకు వాడుకోవాలనుకుంద‌ని కమిషన్ గమనించింది. మృతులకు, బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం అందించిందని తెలిపింది. ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎక్కువ మంది చేశారని పేర్కొంది. 2015 లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సిఎం రాక వల్ల నిరీక్షించిన భక్తులు సిఎం వెళ్లిపోయాక ముహూర్తం దాటిపోతుందన్న ఉత్సుకతతో తోపులాట జ‌రిగింద‌ని కమిష‌న్ నిర్దారించింది.

Read more RELATED
Recommended to you

Latest news