భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల చర్చలు రద్దవడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శనివారం తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై ఇమ్రాన్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. భారత్ చర్యను దురహంకార పూరితమైన, ప్రతికూల చర్యగా అభివర్ణించారు. ‘దార్శనికత లేని తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత పదవులను అధిష్టించారని” అవమానకరమైన, అనుచితమైన వ్యాఖ్యలతో అక్కసు వెళ్లగక్కారు.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్, పాకిస్తాన్‌ల విదేశాంగ మంత్రులు సమావేశమవాలన్న పాకిస్తాన్ చేసిన ప్రాతిపాదనకు భారత్ మొదట ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లోపే భారత ప్రభుత్వం ఆ సమావేశాన్ని రద్దు చేస్తూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు చర్చలంటూ మరో వైపు సైనికులపై దాడి చేయడాన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భారత్ నిర్ణయాన్ని వెల్లడిస్తూ విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్, భారత భద్రతా సిబ్బందిని దారుణంగా హతమార్చడంతో పాటు భారత బలగాల చేతిలో రెండేళ్ళ క్రితం హతమైన బుర్హాన్ వనీని పోరాట యోధుడిగా కీర్తిస్తూ పోస్టల్ స్టాంపులను విడుదల చేయడంపై మండిపడ్డారు. దీంతో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ..పాక్ ప్రధాని చేసిన ట్విట్టర్ కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.