ఈ కాలుష్యకాలంలో, విచిత్ర ఆహారపు అలవాట్లతో శరీరం మొత్తం విషతుల్యమవుతోంది. కాయకష్టం లేకపోవడంతో ఆ హాలాహలానికి బయటికి వెళ్లే దారిలేదు. క్రమంగా మనల్ని కబళిస్తోంది ఈ విషం. రండి… బయట పడేద్దాం. పది రకాలుగా ఫైట్ చేద్దాం. మన కాయాన్ని అమృతమయం చేద్దాం…
కాలుష్యం.. కాలుష్యం… కాలుష్యం…. పీల్చేగాలి, తాగేనీరు, తినేతిండి.. కావేవి కాలుష్యానికి అనర్హం.. ఇలా కాలుష్యం బారినపడి మనకు తెలియకుండానే మన శరీరం విషత్యులమయిపోతోంది. తెలిసి కూడా మద్యపానం, ధూమపానంతో మనం ఇంకొంత దానికి కలుపుతున్నాం. శ్వాసకోశ సమస్యలు, గొంతు సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, రక్తప్రసరణ సమస్యలు.. వీటన్నింటితో బాధపడుతుంటాం. డాక్టర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేస్తున్నాం. ఇవి చిన్నగా కనబడుతున్నా, నిజానికి చాలా పెద్ద బాధలు. క్రమంగా కోలుకోలేని స్థాయికి చేరుకుంటాయి. అప్పుడు ఎంత క్షోభపడినా ప్రయోజనం ఉండదు. మన శరీరంలో క్రమంగా పేరుకుంటున్న ఈ విషాలను రెగ్యులర్‌గా బయటకు పంపించగలిగితే చాలా సమస్యలనుండి మనం బయటపడ్డట్టే.
పీల్చేగాలిలో ఉండే కాలుష్యం, ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ బాధలు బాధిస్తూఉంటాయి. తాగే నీటిలో ఉండే విషకారకాలు, మద్యపానం, ఎక్కడపడితే అక్కడ మనం తాగే కూల్‌డ్రింకులు, జ్యూస్‌లు, తినే పానీపూరీల వల్ల విచ్చలవిడిగా విషపదార్థాలు, బాక్టీరియా కడుపులోకి చేరి, అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. క్రిమిసంహారకమందులు వాడిన ధాన్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్, జంక్‌ఫుడ్.. ఇలా ఏదిపడితే అది తినడం వల్లకూడా విషపదార్థాలు శరీరంలోకి చేరతాయి. మన బాడీలో విషపదార్థాలు ఉన్నాయా?లేవా? తెలుసుకోవడం సులభమే. కడుపులో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, చర్మంపై కురుపులు, మొటిమలు, అక్రమ రుతుచక్రం, తీవ్రమైన అలసట.. ఇవన్నీ విషాల ఉనికిని తెలిపేవే. ఏదైనా మంచి చేయాలంటే, ముందుగా చెడు ఆపాలి. ఇదీ అలాగే.. విషహర ప్రక్రియ(డిటాక్సిఫికేషన్)కు ముందు పైవన్నీ అపేయాలి. ఒక్క గాలిపేల్చడం మన చేతుల్లో లేదు కనుక వదిలేయండి. తర్వాత రిపేర్లు మొదలుపెడదాం.
ఈ క్రింద మీకు పది మార్గాలు సూచిస్తున్నాం. దాదాపు అన్నీ పెద్ద కష్టమేమీలేకుండానే లభించేవే. శరీరం భరించేవే. కష్టం అనుకోకుండా మొదలుపెట్టండి. ఫలితాలు చూడండి. ఇక మీరే వదలరు.
1. పంచదార తగ్గించండి
చక్కెర ముద్దుగా, తెల్లగా ఉండే విషం. శరీరానికి చక్కెర చేసే హాని ఇంతాఅంతా కాదు. పంచదారను ఏరూపంలో తీసుకున్నా, మోతాదు దాటితే ప్రమాదం. శరీరంలోకి ప్రవేశించిన చక్కెరను నియంత్రించాలంటే, ఎక్కువ ఇన్సులిన్ విడుదల కావాలి. అందుకు క్లోమగ్రంథిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది బహుముఖ అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి షుగర్‌ను తగ్గించండి. వీలైతే కొన్నిరోజులపాటు మానేయండి.
2. నీళ్లు బాగా తాగండి
శరీరంలో నుండి విషపదార్థాలను తోడెయ్యడంలో నీరు బాగా సహాయపడుతుంది. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత విషం బయటకెళ్లిపోతుంది. మామూలు నీళ్లు తాగలేకపోతే, ఏదైనా కలుపుకోండి. నిమ్మరసం, అల్లంరసం..లాంటివి.
3. కదలండి.. కష్టపడండి
వ్యాయామం.. ఎలాంటిదైనా శరీరానికి ఎంతో మంచిది. రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని శక్తివంతంగా తయారుచేస్తుంది. రక్తప్రసరణ బాగుపడితే, జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం ఉండదు. కీళ్లు, జాయింట్ల వద్ద ల్యూబ్రికేషన్ బాగుంటుంది. ధృడంగా తయారవుతారు. ఒత్తిడి, ఉద్రిక్తతలు తగ్గి, ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటారు. విపరీతమైన చెమటల వల్ల విషపదార్థాలు వెలివేయబడతాయి. తరచూ వ్యాయామం చేసేవాళ్లలో, చేయనివాళ్లకన్నా విషపదార్థాలు తక్కువగా ఉంటాయి.
4. గ్రీన్ టీ తాగండి
గ్రీన్ టీలో అనామ్లజనకాలు(యాంటీఆక్సిడెంట్లు) పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి రక్షకులు. కణజాలాన్ని నాశనం చేసే ఆక్సిడెంట్లను సమర్థవంతంగా ఎదుర్కొని, వాటిని నిర్మూలించే గొప్ప ఫైటర్లు ఈ యాంటీఆక్సిడెంట్లు. ఇవి మన శరీరంలోనే తయారయ్యే స్వేచ్ఛాకణసమూహాలు. వాతావరణంలో కూడా ఇవి లభిస్తాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను వ్వర్థం చేసి, బయటకు పంపిస్తాయి, తద్వారా మనం ఎప్పుడూ ఆరోగ్యంగా, ధృడంగా ఉండేవిధంగా ప్రోత్సహిస్తాయి.
5. ధ్యానం – ఆవిరిస్నానం
ధ్యానం ఒక అద్భుతమైన ప్రక్రియ. మన మనస్సును, శరీరాన్ని తేలికపరుస్తుంది. ఎప్పుడూ ఫ్రెష్‌గా, ఉల్లాసంగా ఉంచుతుంది. రోజు చేస్తుంటే మీరే నమ్మలేని మంచి ఫలితాలు కనబడతాయి. ఇక ఆవిరిస్నానం – స్టీమ్ బాత్. ఆవిరిస్నానం చర్మరంధ్రాలను తెరుచుకునేలాచేసి, మలినాలను తొందరగా బయటకువెళ్లేలా చేస్తుంది. తద్వారా చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. శరీరం కూడా పునరుత్తేజితమవుతుంది. ఆవిరితో నాసికారంధ్రాలు కూడా శుభ్రపడి, దీర్ఘశ్వాస తీసుకునేందుకు ఉపయెగపడుతుంది. దీర్ఘశ్వాస ఎప్పుడూ విషపదార్థాలను తోలేయడంలో ముందుంటుంది.
6. సేంద్రియ ఆహారం
ఎలాంటి క్రిమిసంహారక మందులు, రసాయనాలు వాడని పంటలనుండి వచ్చే ఆహారాన్ని సేంద్రియ ఆహారం (ఆర్గానిక్ ఫుడ్) అంటారు. కొంచెం కష్టమైనా ఇటువంటి ఆహారాన్ని తినగలిగితే చాలా మంచిది. ఇది ఎటువంటి విషపదార్థాలను కలిగిఉండదు. దొరకకపోతే, కనీసం పొట్టు ఉండే కూరగాయలు, ధాన్యం అయినా మనమే శుభ్రంగా పొట్టు తీసుకుని తింటే బెటర్. మీ పళ్లెంలో రంగురంగుల కూరగాయలు ఉండేవిధంగా చూడండి. ఇవి యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తాయి. మలినాలను పాలద్రోలడంలో సహకరిస్తాయి.
7. మృతకణ నిర్మూలన
చర్మం మీద ఎప్పుడూ పాత కణాలు పాడైపోవడం, కొత్తవి పుట్టుకురావడం సాధారణం. అయితే ఈ మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించడం చాలా అవసరం. అవి చర్మరంధ్రాలను మూసివేసి చెమట, తద్వారా మలినాలను బయటకెళ్లకుండా నిరోధిస్తాయి. మసాజ్ చేయడం, స్క్రబ్బింగ్, బ్రషింగ్ లాంటివి చేసి వీటిని తొలగించాలి. మృతకణ నిర్మూలన ద్వారా రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
8. నిమ్మరసం
నిమ్మరసం అమృతంగా మనం చెప్పుకోవచ్చు. దాన్లో ఉంటే సి-విటమిన్ మన చర్మాన్ని తేజోవంతంగా మారుస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పొద్దున్నే గోరువెచ్చటి నీటిలో ఒక నిమ్మచెక్క పిండుకుని తాగితే, అద్భుతాలు జరిగిపోతాయ్..అంతే.!
9. తేజోవర్ణ ఫలాలు
ప్రతిరోజు తాజా పండ్లు మీ భోజనంలో భాగంగా చేసుకోండి. అవి చేసే మేలు అంతాఇంతా కాదు. వీలైనంతవరకు మంచి రంగుల్లో ఉండే పండ్లు.. చెర్రీలు, నల్లద్రాక్ష, స్ట్రాబెర్రీ, క్యారెట్, బీట్‌రూట్, టొమాటో.. ఇలా బ్రైట్‌గా ఉండేవి తీసుకుంటే, వాటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని తాజాగా ఉంచుతాయి.
10. మంచి నిద్ర
మంచి నిద్రపోవడం కూడా మంచి ఆహారం, వ్యాయామంతో సమానం. చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రతీవాళ్లు 7 లేదా 8 గంటలు నిద్రపోవడం అత్యవసరం. ఈ సమయంలోనే మన శరీరం తిరిగి ఉత్తేజితమై, ఉల్లాసంగా ఉంటుంది. నిద్రపోయేప్పుడే శరీరం తననుతాను శుభ్రపరచుకుంటుంది. మంచి నిద్ర తెల్లవారి మనల్ని చలాకీగా ఉంచుతుంది.
ఇవండీ… మన శరీరంలోనుండి మలినాలను తరిమికొట్లే అద్భుతమైన పనిముట్లు. వీటిని సక్రమంగా వాడి, ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.!
-చంద్రకిరణ్