పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. ప్రధాని నరేంద్రమోదీపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. మోదీ ప్రధాని పదవిలోకి వచ్చినప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఆమె మోదీపై తిట్లదండకం చదువుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆమె ప్రధాని తీరును ఎండగట్టారు. ‘విద్వేష రాజకీయాలు మానుకో’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
అంతటితో మమత కోపం చల్లారిందా అంటే.. అస్సలు చల్లారలేదు. అధికారం కాపాడుకోవడం కోసం మతాల మధ్య చిచ్చుపెడుతూ, విభజన రాజకీయాలు చేస్తున్నావంటూ మోదీపై నిప్పులు చెరిగారు. ‘దేశ ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్షాలు ఆర్థికవ్యవస్థ పురోగతిపై చర్చించి, దేశ అభివృద్ధికి పాటుపడాల్సి ఉంది. కానీ మీ వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతిపక్షాలపై ప్రతీకారేచ్ఛను వీడి, దేశ భవిష్యత్తు కోసం తగిన చర్యలు తీసుకోండి’ అని ఆమె హితబోధ చేశారు.
ఆయుస్మాన్ భారత్ కార్యక్రమాన్ని బెంగాల్‌లో అమలుచేయకపోవడంపై తరచూ విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు కూడా ఆమె గట్టి సమాధానమిచ్చారు. బెంగాల్ ప్రజలకు ఉచిత వైద్యసేవల కోసం ఇప్పటికే పలురకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని, అందుకే ఆయుస్మాన్ భారత్‌ను తాము అమలుచేయడం లేదని మమత చెప్పారు.