సీఎం కేసీఆర్ ఒక గొప్ప లౌకికవాది అని తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ భవన్ లో డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం(Driver Come Owner Scheme) కింద లబ్దిదారులకు హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కొప్పుల మారుతి కార్లను అందజేశారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొత్తం 106 మంది లబ్ధిదారులకు కార్లను అందజేసిన మంత్రులు… జెండా ఊపి కార్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మైనారిటీల భద్రత, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని, మైనారిటీల ఉన్నతికి రాష్ట్రంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం వినూత్నమైనదని, ఇలాంటి పథకం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి కుటుంబ జీవన పరిస్థితులు మెరుగయ్యేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు.
మైనారిటీలను ఉన్నత విద్యావంతుల్ని చేసేందుకు 204 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల వివరించారు. ఇక హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… రాష్ట్రంలో 10వేల మంది ఇమామ్, మౌజమ్ లకు ప్రతి నెల 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మైనారిటీలందరూ సీఎం కేసీఆర్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని చెప్పారు.