కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా సోకవచ్చు. అయితే దీని ప్రభావం చిన్న పిల్లల మీద, వృద్ధుల మీద అధికంగా ఉంటుంది. 70, 80 ఏళ్ళు దాటిన వారికి కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే అని ఇప్పటికే చాలా మంది హెచ్చరించారు.
కానీ, శరీరంలో వ్యాధినిరోధక శక్తి, జీవితం మీద ఆశ, ధైర్యం ఉంటే ఈ మహమ్మారిని జయించవచ్చని నిరూపించింది ఓ 107 ఏళ్ల బామ్మ. మహారాష్ర్టలో ఓ 107 ఏళ్ల బామ్మ, ఆమె కుటుంబంలో మరో నలుగురికి కరోనా నిర్ధారణ కావడంతో జల్నా సిటీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే వారం రోజుల పాటు చికిత్స అనంతరం వారికి టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.