10వ తరగతి: పరీక్షలవేళ ఇవి కీలకం

-

మార్చి 19 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్‌ పూర్తిచేసుకుని పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. ఇది విద్యార్థులకు అత్యంత కీలకమైన దశ. ఏడాదిపాటు కొనసాగిన ప్రిపరేషన్‌ ఒక ఎత్తయితే, చదివిన అంశాలన్నింటిని ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షల్లో రాయడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో పరీక్షలవేళ 10వ తరగతి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెళకువల గురించి తెలుసుకుందాం..

1. విద్యార్థులు తమకు అత్యంత కీలకమైన ఈ సమయంలో కేవలం సబ్జెక్టుల్లోని అంశాలపైనేగాక.. ఆహారం, నిద్ర వంటి ఆరోగ్యపరమైన అంశాలపైన కూడా శ్రద్ధపెట్టాలి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అన్ని విధాల సంసిద్ధమై ఉండాలి. ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరనీయకూడదు. కొంతమంది పరీక్షల సంబంధించి ఎన్నో అపోహలు సృష్టిస్తారు. అలాంటి వాటిని నమ్మి అనవసర భయాలకు లోనవకూడదు.

2. పదోతరగతి పరీక్షల్లో పరీక్షకు, పరీక్షకు మధ్య పెద్దగా సమయం ఉండదు. కొన్ని పరీక్షలకు ఒకరోజు సమయం ఉంటే.. మరికొన్ని పరీక్షలకు మాత్రం హాఫ్‌ డే సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత సబ్జెక్టుకు లభించిన సమయం ఆధారంగా విద్యార్థులు రివిజన్‌కు ప్లాన్‌ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టులోనూ ప్రిపరేషన్‌ సందర్భంగా చదివిన అంశాలను మాత్రమే రివిజన్‌ చేయాలి. పరీక్ష రేపనగా కొత్త విషయాల జోలికి వెళ్తే అనవసర ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది.

3. ఈ కీలక సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారు. దీంతో మంచి మార్కులు కూడా సాధించగలుగుతారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర అవసరం. రోజుకు ఆరు గంటలకు తక్కువకాకుండా నిద్రకు సమయం కేటాయించాలి. రివిజన్‌కు టైమ్‌ సరిపోదని నిద్రపోకుండా చదివితే తర్వాత పరీక్షహాల్లో తలనొప్పి, కండ్లలో మంట లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో బాగా చదివిన అంశాలను కూడా సరిగా రాయలేక నష్టపోవాల్సి వస్తుంది.

4. ఆహారం విషయంలో కూడా విద్యార్థులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్లకూడదు. కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇలాంటి ఆహారంవల్ల కడుపులో తిప్పినట్లుగా, మంటపుట్టినట్లుగా ఉంటుంది. ఇది రివిజన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో పరీక్షల్లో తెలిసిన ప్రశ్నలకు కూడా సరిగా సమాధానాలు రాయలేక మార్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రొటీన్లతో కూడాని ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

5. పరీక్షహాల్లో కూడా విద్యార్థులు కొన్ని ముఖ్యమైన మెళకువలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది పరీక్షహాల్లో అడుగుపెట్టగానే ‘ప్రశ్నపత్రం ఎలా వస్తుందో.., ఎలాంటి ప్రశ్నలు ఇస్తారో.., నేను సమాధానాలు సరిగా రాయగలనో లేదో..? అని ఆందోళన చెందుతుంటారు. మీ ప్రిపరేషన్‌ సజావుగా సాగివుంటే ఇలాంటి అనవసర ఆందోళన అక్కర్లేదు. దీనివల్ల సమాధానాలు తెలిసిన ప్రశ్నలకు కూడా సరిగా జవాబులు రాయలేకపోయే ప్రమాదం ఉందే తప్ప మరెలాంటి ప్రయోజనం ఉండదు.

6. కొందరు విద్యార్థులు టైమ్‌ సరిపోదన్న భయంతో ప్రశ్నపత్రం ఇవ్వగానే హడావిడిగా సమాధానాలు రాయడం మొదలుపెడతారు. ఇది సరికాదు. బాగా ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో ఆ ప్రిపేరయిన అంశాలను పరీక్షల్లో సూటిగా, అర్థవంతంగా రాయడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాత.. మనసు ప్రశాంతం చేసుకుని మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలి.

7. మరి కొంతమంది విద్యార్థులు రాత నీట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో సమాధానాలు నిదానంగా రాస్తుంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మొదట్లో నిదానంగా సమాధానాలు రాయడం వల్ల ఆఖర్లో రాయాల్సింది ఎక్కువగా సమయం తక్కువగా ఉంటుంది. దీంతో చివరి ప్రశ్నలు హడావిడిగా సమాధానాలు రాసి మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మరీ కంగారుపడిగానీ, మరీ నిదానంగాగానీ కాకుండా ఒక్కో ప్రశ్నకు లభించే నిర్ధారిత సమయంలో సమాధానం పూర్తిచేయాలి.

8. ప్రతి సబ్జెక్టులోనూ ఏ సెక్షన్‌కు, ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించవచ్చనే విషయంలో పరీక్షకు ముందే అవగాహన చేసుకోవాలి. దీనివల్ల పరీక్షహాల్లో అనవసర కన్ఫ్యూజన్‌ దరిచేరకుండా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రశ్నకు సమాధానం రాయడం పూర్తయిన తర్వాత కనీసం రెండు లైన్లు గ్యాప్ ఇచ్చి.. మరో ప్రశ్నకు సమాధానం రాయాలి. దీనివల్ల మీ సమాధాన పత్రం నీట్‌గా ఉండటమేగాక, మంచి మార్కులు పొందే అవకాశం కూడా ఉంటుంది.

9. ఇలా చిన్నచిన్న మెళకువలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా పరీక్షలు రాయండి. అనవసర భయాలు, ఆందోళనలతో నష్టమే తప్ప లాభం లేదనే విషయాన్ని గ్రహించండి. చదివిన అంశాలను చక్కగా ప్రజెంట్‌ చేస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌ స్టూడెంట్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version