పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ముజువాణి ఓటు ద్వారా ఎగువ సభ ఆమోదం తెలిపింది. వీరిని శీతాకాల సమావేశాల మొత్తానికి సభ నుంచి సస్పెండ్ చేశారు.
గత ఆగస్టు నెలలో వర్షాకాల సమావేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, తృణమూల్ కాంగ్రెస్ ఇద్దరు, శివసేన నుంచి ఇద్దరు, సీపీఎం, సీపీఐ నుంచి ఒక్కొక్కరు నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ఫూలో దేవి నేతమ్, చాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్ అఖిలేశ్ ప్రసాద్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డోలా సేన్, శాంత ఛెత్రి శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, సీపీఎం నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం సస్పెండ్‌కు గురైన వారిలో ఉన్నారు.