రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ‘వెల్’నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. వైద్యం రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అమీర్ పేట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో 150 వెల్ నెస్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు.
వాటికే తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాల పేరు పెట్టుకుందని అన్నారు కిషన్ రెడ్డి. బీబీనగర్ ఎయిమ్స్ కు రూ.800 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని అన్నారు.