కేంద్రం అమలు చేస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం విదితమే. అయితే రైతుల ఆందోళనలకు మద్ధతుగా 200 మంది ఢిల్లీ పోలీసులు రాజీనామాలు చేశారని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైతుల ఆందోళనలకు మద్దతుగా 200 మంది ఢిల్లీ పోలీసులు రాజీనామాలు చేశారు. పార్టీ ఇప్పుడే మొదలైంది.. అంటూ ఒక మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇదంతా అబద్దమని తేలింది. ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనిల్ మిట్టల్ స్పందిస్తూ.. ఆ వార్త ఫేక్ అని, పోలీసులు ఎవరూ రాజీనామాలు చేయలేదన్నారు. జనవరి 26 సందర్భంగా గణతంత్ర వేడుకల్లో గాయపడ్డ పోలీసులు ఇప్పటికీ హాస్పిటళ్లలో చికిత్సను పొందుతున్నారని తెలిపారు.
కాగా జనవరి 26 వేడుకల్లో ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఒక రైతు మృతి చెందగా, వందల సంఖ్యలో రైతులు, పోలీసులు గాయపడ్డారు. దీంతో ఢిల్లీ పోలీసులు పలు రైతు సంఘాల నాయకులపై కేసులు నమోదు చేశారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో పలు చోట్ల గత 2 రోజులుగా రైతులు వెనక్కి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ రైతులు ప్రస్తుతం తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.