రాష్ట్రంలో 20వేల మెగావాట్ల క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంధన పునరుత్పత్తి, క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు తరాలకు అవసరమన్నారు. పర్యావరణ నిపుణులు, సామాజిక వేత్తలు క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రానికి 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి 2030 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్ కు చేరుకుంటుందన్నారు.
2035 నాటికి 31,890 మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్కలు చెబుతున్నాయన్నారు. పెరుగుతున్న డిమాండ్ మేరకు కాలుష్య రహిత 20వేల మెగావాట్ల క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీని తయారు చేసుకోవాలని న్యూ ఎనర్జీ పాలసీతో ముందుకెళుతున్నామన్నారు. ఇందుకోసం ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోనిందని తెలిపారు.