రివ్యూ.. 30రోజుల్లో ప్రేమించడం ఎలా.

-

నటీనటులు: ప్రదీప్, అమృత అయ్యర్, శుభలేఖ సుధాకర్, పోసాని, హేమ, హర్ష,
దర్శకత్వం: మున్నా
నిర్మాత : ఎస్వీ బాబు
బ్యానర్: ఎస్వీ ప్రొడక్షన్స్
ఎడిటింగ్: ప్రవీణ్ కె ఎల్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

యాంకర్లు సినిమాల్లో నటించడం కామనే. ఐతే ఇప్పటి వరకు తెలుగులో యాంకర్ గా చేసిన అమ్మాయిలే సినిమాల్లో హీరోయిన్లుగా కనిపించారు. మేల్ యాంకర్లు హీరోలుగా చేసిన సందర్భాలు తక్కువ. అలా చేసిన తక్కువ మందిలో అందరికీ ఆసక్తి కలిగించింది మాత్రం ప్రదీప్ మాచిరాజు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రదీప్ మెప్పించాడా లేదా చూద్దాం.

కథ:

అర్జున్( ప్రదీప్), అక్షర(అమృత)… పక్కపక్క ఇళ్ళలో ఉండే ఈ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతుంటారు. ఒకరంటే ఒకరికి విపరీతమైన అసహ్యం ఉంటుంది. ఐతే అనుకోకుండా అరకు వెళ్ళినపుడు ఒకానొక సంఘటన ద్వారా పునర్జన్మ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత సంఘటనలు ఏ విధంగా మలుపు తిరిగాయన్నదే కథ.

నటీనటులు

ప్రదీప్ తన పాత్రలో ఒదిగిపోవడానికి బాగానే ప్రయత్నించాడు. కానీ కొన్ని కొన్ని చోట్ల యాంకర్ కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కామెడీ సీన్లలో హీరో కంటే ఎక్కువ యాంకరే కనిపించడం కొంత మైనస్ గా మారింది. అమృత అయ్యర్ తన పరిధిలో బాగానే చేసింది. సెకండాఫ్ లో తన పర్ ఫార్మెన్స్ కి బాగా స్కోప్ దొరికింది. కానీ సినిమాలో సూపర్ అనిపించే సీన్లు పెద్దగా లేవు. శుభలేఖ సుధాకర్, పోసాని, హర్ష్, హేమమ్ భద్రం పాత్రలు పెద్దగా నవ్వు తెప్పించవు. వాళ్ళు బాగానే చేసినప్పటికీ కామెడీ అంతగా పండలేదు.

విశ్లేషణ

దర్శకుడు మున్నా రాసుకున్న పాయింట్ బాగానే ఉన్నా దానికి అనుగుణంగా కథనాన్ని సరిగ్గా నడిపించలేకపోయాడు. పాతబడిపోయినా పంచ్ డైలాగులని పట్టుకుని నవ్వు తెప్పించే ప్రయత్నం బెడిసికొట్టింది. అదీగాక పటాస్ సినిమాలోలా విద్యార్థుల అమ్మల చేత స్టూడెంట్లని కొట్టించడం బోర్ కొట్టించింది. శుభలేఖ సుధాకర్ పాత్రని కామెడీగా తీర్చిదిద్దడం అస్సలు బాగాలేదు. దాశరథి శివేంద్ర కెమెరా పనితనం కూర్చునేలా చేస్తుంది. ఆ పనితీరు నీలి నీలి ఆకాశం పాటలో బాగా కనిపిస్తుంది. కొన్ని సీన్లు ఎడిటింగ్ లో పోవాల్సి ఉందని అనిపించింది. అనవసరమైన కామెడీని కావాలని ఇరికించినట్టుగా ఉంది. వాటన్నింటినీ తీసేసి, దర్శకుడు అనుకున్న కథనే జెన్యూన్ గా చెబితే కొంచెం ఆసక్తి కలిగేలా ఉండేదేమో! ఆత్మలు మారిపోవడం అనే అంశం బాగానే ఉన్నప్పటికీ అదెందుకనేదానికి సరైన లాజిక్ లేదు. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. నీలి నీలి ఆకాశం సహా కొన్ని చోట్ల నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించింది.

తీర్పు

పాటంత బాగుంటుంది సినిమా అని చెప్పుకున్న 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి వెళ్తే పాట ఒక్కటే బాగుందన్న ఫీలింగ్ వచ్చేలా తెరకెక్కించారు.

చివరగా

30నిమిషాలు కూడా కష్టమే..

Read more RELATED
Recommended to you

Exit mobile version