ర్యాగింగ్ పేరుతో సీనియర్ల టార్చర్ .. 34 మంది సస్పెండ్

-

కష్టపడి చదివి ఎంసెట్​లో టాప్ ర్యాంకులు సాధించి తమ భవిష్యత్ నిర్మాణం కోసం కొత్త ఆశలతో ఆ కళాశాలలో చేరారు. కానీ కాలేజ్​లో చేరిన మొదటి రోజు నుంచే సీనియర్ల నుంచి ర్యాగింగ్ మొదలైంది. ఏదో చిన్నపాటి ర్యాగింగ్ అయితే సరేలే అని సర్దుకునే వారే. కానీ ర్యాగింగ్ శ్రుతిమించి వికృత చేష్టలకు దారి తీసింది. అంతటితో ఆగకుండా టార్చర్​గా మారింది. ఇక ఉండబట్టలేక.. భరించే ఓపిక లేక ఆ జూనియర్లు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో.. డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్‌ చేసింది. వీరిలో 25 మందిని తరగతులు, హాస్టళ్ల నుంచి.. మరో 9 మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది.

రాజేంద్రనగర్‌లోని వర్సిటీ క్యాంపస్‌ కాలేజీలో  పశువైద్య డిగ్రీ(బీవీఎస్సీ) కోర్సు రెండో, నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ 34 మంది ఇటీవల కొత్తగా చేరిన జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ పేరుతో నానా రకాలుగా హింసించినట్లు బాధితులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు. ర్యాగింగ్‌, హింసించిన తీరును బాధితులు వివరించడంతో బాధ్యులను రెండు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సోమవారం వర్సిటీ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి విచారణ జరిపిన తరవాత తదుపరి చర్యలుంటాయని వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version