రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉందని నాలుగు రోజుల కిందట నిర్వహించిన మీడియా సమావేశంలో స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు. “అదృష్టం కొద్దీ మన దగ్గర కరోనా పాజిటివ్ కేసులు 10 మాత్రమే తేలాయి. అది కూడా విదేశాల నుంచి వచ్చిన వారే! ఇది చాలా ఆనందించాల్సిన విషయం. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్“- అని జగన్ వ్యాఖ్యానించారు. అయితే, పట్టుమని నాలుగు రోజులు కూడా తిరగక ముందుగానే పరిస్తితి బేజారెత్తింది. ఇప్పుడు ఏపీ సీఎం సహా అధికారులు, నాయకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గుండెలు అరచేతిలో పెట్టుకుని కరోనా నియంత్రణకు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారు.
గత(మంగళవారం) రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకూ 43 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 373 మందికి పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. మిగిలిన 330 కేసులు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. కొత్తగా నేడు అత్యధికంగా కడపలో 15 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరిలో 13 కేసులు, చిత్తూరులో 5, ప్రకాశం 4, నెల్లూరు 2, తూర్పు గోదావరిలో 2, కృష్ణా 1, విశాఖ 1 కేసు.. మొత్తంగా నేడు ఒక్కరోజే 43 కేసులు నమోదయ్యాయి.
దీంతో నిన్న మొన్నటి వరకు ఈ కేసుల విషయంలో ఎంతెంత దూరం అంటే చాలా చాలా దూరమనే రేంజ్‌లో ఉన్నామని హ్యాపీగా ఫీలైన జగన్.. ఇప్పుడు బేజారెత్తిపోతున్నారు. ఈ సంఖ్య రేపటికల్లా తెలంగాణ(100 కేసులు)ను మించిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.