ఓయూ విద్యార్థులకు శుభవార్త.. రూ.240 కోట్లతో..

-

ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఓయూలో కొత్తగా 6 హాస్టళ్లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ‘మన యూనివర్సిటీ – మన ఉస్మానియా’ కార్యక్రమంలో భాగంగా కొత్త హాస్టళ్లను నిర్మిస్తే వసతి సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని ప్రతిపాదనలు చేశారు. ఈ 6 హాస్టళ్లలో 3 అమ్మాయిల కోసం కాగా, మరో 3 అబ్బాయిల కోసం నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. బహుళ అంతస్తుల్లో నిర్మించే ఈ హాస్టళ్ల నిర్మాణం కోసం సుమారు రూ.240 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కొత్త హాస్టళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు.

పూర్వ విద్యార్థులు ఎవరైనా నిధులు సమకూరిస్తే వారి పేరుతో హాస్టళ్లు నిర్మించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఓయూలో అమ్మాయిలకు 7 హాస్టళ్లు, అబ్బాయిలకు 17 హాస్టళ్లు ఉన్నాయి. మరోవైపు.. వర్సిటీలో ఏటా అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న గర్ల్స్‌ హాస్టళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అదేవిధంగా అబ్బాయిల హాస్టళ్లు ఎప్పుడో నిర్మించినవి కావడంతో చాలావరకు అధ్వాన్నంగా మారాయి. కొన్ని హాస్టళ్లు ఇప్పటికీ రేకుల షెడ్‌లతోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త హాస్టళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version