తెలంగాణ సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటల సొంత నియోజవర్గమైన హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కింది. అయితే హుజురాబాద్ లో తన క్యాడర్ నుంచి ఎవరు వెళ్ళిపోకుండా టీఆర్ఎస్ ఎప్పటికప్పడూ స్థానిక ప్రజాప్రతినిధులతో టచ్ లో ఉంటుంది. ఇందులో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ అక్కడి ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా మంత్రి గంగుల కరీంనగర్ లో వారితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ లో 99 శాతం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీతోనే ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు అమ్ముడుపోతారని ఈటల వాఖ్యానించడం భాదిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉండవని, అందరూ కేసీఆర్ వర్గమేనని స్పష్టం చేసారు. టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్వచ్చందంగా పత్రికాముఖంగా వెల్లడించారని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు సంపూర్ణంగా అండగా ఉంటామని, తమ క్యాడర్ అమ్ముడుపోయేవారు కాదని గంగుల వ్యాఖ్యానించారు.
హుజురాబాద్ నియెజకవర్గంలోని మండలాల వారీగా ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారని గంగుల వెల్లడించారు. కేవలం ఈటల చేసిన ఒత్తిడి, బెదిరింపులతోనే తొలుత ఆయనకు మద్దతుగా మాట్లాడామని, కానీ తమకు ఓటేసిన ప్రజలు నిలదీయడంతో కన్న తల్లిలాంటి పార్టీతోనే ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సంపూర్ణ మద్దతు ఇచ్చిన పార్టీని వీడేదే లేదని, పార్టీపై అసభ్యంగా, అసత్యాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించినట్లు గంగుల వెల్లడించారు.