బ్యాడ్మింటన్ ఆడుతూ యువ ఆటగాడు ఆకస్మికంగా మరణించడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటివరకూ బ్యాడ్మింటన్ కోర్టులో కొదమ సింహంలా తలపడిన యువ ఆటగాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూయడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఇండోనేషియాలో ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతోంది. ఈ ఛాంపియన్‌షిప్ గెలిచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారులు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన కజుమాతో చైనాకు చెందిన జాంగ్ జిజీ తలపడ్డాడు. ఇరువురు హోరాహోరిగా తపడుతున్నారు.
తొలి గేమ్‌లో ఇరువురి స్కోరు 11-11 వద్ద సమంగా ఉన్న సమయంలో జాంగ్ జిజీ ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. సర్వీస్‌ను అందుకునే క్రమంలో జిజీ కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అక్కడేవ్వరికీ అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత కోలుకున్న నిర్వాహకులు జాంగ్ జిజీని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జిజీ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రకటనతో నిర్వాహకులు షాక్‌గు గురయ్యారు. అప్పటివరకూ విరోచితంగా పోరాడిన జిజీ.. ఒక్కసారిగా మరణించడంతో నిర్వాహకులు సహా అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు.